Begin typing your search above and press return to search.

ఏపీలోనూ టాలీవుడ్ విస్త‌ర‌ణ కావాల్సిందే

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:30 PM GMT
ఏపీలోనూ టాలీవుడ్ విస్త‌ర‌ణ కావాల్సిందే
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మ్మోహ‌న్ రెడ్డితో ఈ రోజు టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా భేటీ అయిన విష‌యం తెలిసిందే. దాదాపు 17 అంశాల‌పై ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడారు. అయితే ఏపీలో షూటింగ్ లు జ‌ర‌గాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకురావ‌డంలో ప్ర‌ముఖ సినీ న‌టుడు చిరంజీవి ఎంతో కృషి చేశార‌న్నారు.

చిరంజీవి సినీ ప‌రిశ్ర‌మ కోస‌మే ఆలోచించి ఒక రిలీఫ్ వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశార‌న్నారు. ఇదే సంద‌ర్భంగా ఆర్. నారాయ‌ణమూర్తి చిన్న సినిమాల గురించి త‌న ఆవేద‌న‌ని సీఎంకు వివ‌రించార‌ని, సీఎం కూడా స్పందించి చిన్న సినిమాల‌కు అవ‌కాశం వుండాల‌న్నార‌ని తెలియ‌జేశారు. దీనిపై సినీ ప్ర‌ముఖులంతా స్పందించార‌ని, చిన్న సినిమాలు కూడా బ్ర‌త‌కాల‌ని చెప్పార‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్నినాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోనూ సినిమా షూటింగ్ లు జ‌ర‌పాల‌ని, ఈ విష‌యంలో సినీ ప్ర‌ముఖులంతా స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కోరిన‌ట్టుగా వెల్ల‌డించారు. అంతే కాకుండా విశాఖలో కూడా షూటింగ్ లు జ‌ర‌పాల‌ని, అందుకు త‌గిన సౌక‌ర్యాల‌ని తాము క‌ల్పిస్తామ‌ని, తెలుగు సినిమాల షూటింగ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జ‌రిగేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి సీఎం కోరిన‌ట్టుగా మంత్రి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు చెప్పిన స‌మాధానం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మ‌కు హైద‌రాబాద్ ఎంతో ఏపీ కూడా అంతేన‌ని ఏపీలోనూ షూటింగ్ లు జ‌రుపుతామ‌ని వారు స్ప‌ష్టం చేసిన తీరుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ తో పోలిస్తే ఏపీ ద్వారా 60 శాతం ఇన్ క‌మ్ ల‌భిస్తోంది. ట్యాక్స్‌ల రూపంలో ఏపీకి ఎలాంటి వాటా ద‌క్క‌డం లేదు కానీ తెలంగాణ‌లో ఇండ‌స్ట్రీ వున్న కార‌ణంగా ట్యాక్స్‌ల రూపంలో తెలంగాణ ప్ర‌భుత్వానికే అధిక మొత్తం ద‌క్కుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం క‌న్నేసిన‌ట్టుగా తాజా వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ కార‌ణంగానే ఏపీ సీఎం టాలీవుడ్ ని ఏపీలోనూ విస్త‌రించాల‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వైజాగ్ లోనూ విస్త‌రించాల‌ని, అక్క‌డ ప్ర‌ముఖుల‌కు స్థ‌లాలు ఇస్తాన‌ని, స్టూడియోల నిర్మాణం కోసం భారీ స్థాయిలో స్థ‌లాల‌ని కేటాయిస్తామ‌ని ఏప‌సీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం, వైజాగ్ లోనూ జూబ్లీహిల్స్ త‌ర‌హా ప్రాంతాన్ని సృష్టిద్దాం. చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ల‌తో వైజాగ్ పోటీప‌డ‌గ‌ల‌దు. మ‌నంద‌రం అక్క‌డికి వెళ్లాలి. అప్పుడే విశాఖ ఇవ్వాళ కాక‌పోయినా ప‌దేళ్ల‌కో.. ప‌దిహేనేళ్ల‌కో మ‌హాన‌గ‌రాల‌తో పోటిప‌డుతుంది అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీలోనూ టాలీవుడ్ విస్త‌ర‌ణ కావాల్సిందే అనే వాద‌న‌కు అద్దంప‌డుతున్నాయి.