Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. 99 ఏళ్ల పెద్దమనిషి రెండు రికార్డులు బ్రేక్ చేశారు

By:  Tupaki Desk   |   25 April 2020 4:30 AM GMT
కరోనా వేళ.. 99 ఏళ్ల పెద్దమనిషి రెండు రికార్డులు బ్రేక్ చేశారు
X
అసలే కరోనా టైం. కాలు బయటకు పెట్టకుండా ఇళ్లల్లోనే ఉండాలంటూ ప్రభుత్వ ఆదేశాలు. పెద్ద వయస్కులు అసలే బయటకు రావొద్దన్న హెచ్చరికలు. ఇలాంటివేళ.. 99 ఏళ్ల పెద్ద మనిషి ఏం చేయగలడు? అన్న సందేహం రావొచ్చు. ఈ ఉదంతం గురించి తెలిస్తే మాత్రం.. వణికించే కరోనా వేళలోనూ సంకల్పం ఉండాలే కానీ సాధించలేనిది ఏమీ లేదన్న విషయాన్ని నిరూపించారు బ్రిటన్ కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి కెప్టెన్ టామ్ మూరే.

ఇప్పుడాయన చేసిన పనికి ప్రపంచమే ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకుంటోంది. వైరస్ విపత్తుతో ప్రపంచం గజగజలాడిపోతున్న వేళ.. ఆయన రెండు రికార్డుల్ని బ్రేక్ చేశాడు. తన సెంచరీ బర్త్ డేకు కావాల్సినంత భారీ గిఫ్టును ఆయనకు ఆయనే సాధించుకున్నారని చెప్పాలి. ప్రపంచ దేశాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కరోనా వైరస్ బ్రిటన్ ను వణికిస్తున్న వేళ.. ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాల్ని కోల్పోతున్నారు. దీంతో.. నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీ కోసం విరాళాలు సేకరించాలని డిసైడ్ అయ్యారు మూరే.

వాకింగ్ ఫ్రేమ్ ను ఉపయోగించి 25 మీటర్లు ఉండే తన ఇంటి గార్డెన్ చుట్టూ రోజుకు పది రౌండ్లుచొప్పున.. వంద రౌండ్లు నడవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా "Tom's 100th Birthday Walk For The NHS" పేరుతో వెయ్యి పౌండ్ల విరాళాల్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న లక్ష్యం కేవలం 24 గంటల వ్యవధిలోనే సాధించారు. దీంతో.. విరాళాల్ని మరింత భారీగా సేకరించాలనే లక్ష్యంతో తన నడక లక్ష్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు.

ఈ పెద్దాయన చేసిన పని బ్రిటిషర్లపైన పెను ప్రభావాన్ని చూపింది. 99 ఏళ్ల వయసులో ప్రజల కోసం ఆయన పడుతున్న ఆరాటం చాలామందిని ఆలోచించేలా చేయటమే కాదు.. తమ వంతు సాయంగా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేలా చేసింది. దీంతో శుక్రవారం నాటికి 28 మిలియన్ల పౌండ్ల విరాళంగా సేకరించగలిగారు. దీంతో భారీ ఎత్తున విరాళాల్ని సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ను సొంతం చేసుకోవటమే కాదు 2021 గిన్నిస్ బుక్ ఫ్రంట్ కవర్ పైన ఆయన ఫోటోను అచ్చేయనున్నారు.

భారీ ఎత్తున విరాళాల్ని సేకరించిన రికార్డు గతంలో కెనడాకుచెందిన టెర్రీ ఫాక్స్ పేరుతో ఉండేది. నలభై ఏళ్ల క్రితం విరాళాల్ని సేకరించటం కోసం కృతిమ కాలుతో 143 రోజులు పరిగెత్తిన ఆయన 14.7 మిలియన్ల కెనడా డాలర్లను సేకరించారు. ప్రస్తుత విలువ ప్రకారం చూస్తే.. ఆ మొత్తం 27 మిలియన్ పౌండ్లకు సమానం. ఆ రికార్డును టామ్ బ్రేక్ చేశారు.

కరోనా కారణంగా తీవ్రమైన నిరాశలో మునిగిన బ్రిటన్ పౌరులకు టామ్ కొత్త స్ఫూర్తిగా నిలవటమే కాదు.. ధైర్యంగా మారారు. ప్రజల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపటం కోసం ఆయన మరో వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రముఖ సింగర్ మైకెల్ బాల్ తో కలిసి ఒక సింగిల్ పాడారు. ఇప్పుడది యూకేలో నెంబర్ వన్ గా నిలిచింది. ఇదో రికార్డుగా చెబుతున్నారు. తన వందో పుట్టిన రోజుకు కేవలం ఆరు రోజుల ముందు ఆయన సాధించిన రెండు రికార్డులు బ్రిటన్ లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ప్రపంచం మొత్తానికి టామ్ కొత్త స్ఫూర్తిగా నిలిచారు. కనిపించని వైరస్ మీద ప్రపంచం చేస్తున్న పోరాటానికి టామ్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారని చెప్పక తప్పదు.