Begin typing your search above and press return to search.

రేపే భారత్ బంద్ .. వైసీపీ సంపూర్ణ మద్దతు .. ఆ సేవలకు మినహాయింపు !

By:  Tupaki Desk   |   25 March 2021 1:30 PM GMT
రేపే భారత్ బంద్ ..  వైసీపీ సంపూర్ణ మద్దతు .. ఆ సేవలకు మినహాయింపు !
X
కేంద్రానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 26వ తేదీన భారత్ బంద్‌కు తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ బంద్‌ ను దేశ పౌరులంతా కలిసి పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే మార్చి 26వ తేదీన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్ ‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం ఈ బంద్ నుండి మినహాయింపు ఉంటుంది.

ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రహదారులు మూసుకుపోనున్నాయి. అటు ప్రజా రవాణా అంతా బంద్ కానుంది. అలాగే మార్కెట్లు, జనసాంద్రిత ప్రదేశాలను సైతం మూసివేయనున్నారు. అన్నదాతలను గౌరవించి.. ఈ భారత్ బంద్ విజయవంతం అయ్యేలా చూడాలని దేశ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం అని రైతు సంఘం నాయకుడు దర్శన్ పాల్ తెలిపారు. రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ ‌బంద్ ‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం కేంద్రానికి లేఖ కూడా రాశారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కానున్నట్లు స్పష్టం చేశారు. అయితే బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా, భారత్ బంద్‌ కు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇక రేపటి భారత్ బంద్‌ కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని, టీడీపీ శ్రేణులు బంద్‌ ను విజయవంతం చేయాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనకు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అదే రోజు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.