Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్ని వ‌ణికించనున్న మ‌రో తుఫాన్‌!

By:  Tupaki Desk   |   29 Oct 2017 6:03 AM GMT
తెలుగు రాష్ట్రాల్ని వ‌ణికించనున్న మ‌రో తుఫాన్‌!
X
ప‌ది రోజుల క్రితం వ‌ర‌కూ హైద‌రాబాదీయుల‌తో పాటు ప‌లు తెలుగు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డిన సంగ‌తి తెలిసిందే. భారీగా కురిసిన వ‌ర్షాల‌తో తెలుగు ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అన్నింటికి మించి కోటి కంటే ఎక్కువ మంది ఉన్న హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ప్ర‌జ‌లు విడ‌వ‌కుండా నిత్యం కురిసిన వ‌ర్షాల‌తో ప‌డిన తిప్ప‌లు అన్నిఇన్ని కావు. భారీ వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ తిన్న రోడ్లు ఇప్ప‌టికి బాగుప‌డ‌లేదు.

దెబ్బ తిన్న రోడ్ల కార‌ణంగా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు నిత్యం ట్రాఫిక్ క‌ష్టాల్ని అనుభ‌విస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారీ వ‌ర్షాల కార‌ణంగా కూర‌గాయ‌ల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. పంట‌లు పోవ‌టంతో మ‌రో నెల వ‌ర‌కూ కూర‌గాయ‌ల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగోళ్ల గుండెలు అదిరే మాట‌ను చెప్పారు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు. తాజాగా నెల‌కొన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని చూస్తే.. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని.. న‌వంబ‌రు ఒక‌టో తేదీ నాటికి గ‌ల్ఫ్ ఆఫ్ సైమ్ లో ప్ర‌వేశిస్తుంద‌ని చెప్పారు.

అక్క‌డెక్క‌డో చైనాలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నంతో తెలుగోళ్ల‌కు చిక్కేమిట‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. విష‌యం ఏమిటంటే.. ద‌క్షిణ చైనాలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం న‌వంబ‌రు మూడో తేదీ నాటికి ఉత్త‌ర అండ‌మాన్ స‌ముద్రంలోకి రానుంది. ఇది అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డి తుఫాన్‌ గా మార‌నుంది.

నిపుణుల అంచ‌నా ప్ర‌కారం న‌వంబ‌రు ఐదారు తేదీల నాటికి మ‌ధ్య బంగాళాఖాతానికి చేరుతోంది. దీని ప్ర‌భావంతో కోస్తా.. ఒడిశాల‌లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మిగిలిన తెలుగు ప్రాంతాల్లోనూ వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు నైరుతి రుతుప‌వ‌నాల కార‌ణంగా బంగాళాఖాతం ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నాల కార‌ణంగా రానున్న ఇర‌వైనాలుగు గంట‌ల్లోనూ వ‌ర్షాలు ప‌డతాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే కురిసిన వ‌ర్షాల దెబ్బ‌కు ఉక్కిరిబిక్కిరి అయిన ప్ర‌జ‌ల‌కు రానున్న వ‌ర్షాలు మ‌రెన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాయో?