Begin typing your search above and press return to search.

వివాదాలే.. ఈ బాబాలకు కేరాఫ్ అడ్రెస్!

By:  Tupaki Desk   |   25 Aug 2017 12:58 PM GMT
వివాదాలే.. ఈ బాబాలకు కేరాఫ్ అడ్రెస్!
X
ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారిన‌ డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ వివాదంపై ఎట్ట‌కేల‌కు సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. బాబా ముసుగులో త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఇద్ద‌రు సాద్వీల‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టిన గుర్మీత్ బాబాపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌గా సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం బాబా రేపిస్టేన‌న‌ని నేటి మ‌ధ్యాహ్నం పంచ‌కుల‌లోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ బాబాకు ఏ త‌ర‌హా శిక్ష విధించే అంశాన్ని ఈ నెల 28న వెల్ల‌డించ‌నున్న‌ట్లు సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు. శిక్ష ఖ‌రారు త‌ర్వాత సంగ‌తి... దోషిగా తేలిన బాబాను వెనున‌వెంట‌నే పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంట‌నే అక్క‌డే కోర్టు ఆవ‌ర‌ణ‌లోకే వైద్యుల‌ను పిలిపించి వైద్య పరీక్ష‌లు నిర్వ‌హించి రోహ్‌ త‌క్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

అయినా ఇక అత్యాచారాల‌కు పాల్ప‌డ్డ బాబాకు శిక్ష ప‌డింది క‌దా... మ‌ళ్లీ ఆ ప్ర‌స్తావ‌న ఎందుకు అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. భార‌త దేశమంటే ఆధ్యాత్మిక‌త‌కు కేరాఫ్ అడ్రెస్ అని విదేశాల్లో మంచి పేరుంది. జ‌నాల‌ను స‌న్మార్గంలో న‌డిపించే స‌త్తా క‌లిగిన బాబాల‌కు భార‌త్ నిల‌య‌మ‌ని, ఆ దేశానికి వెళితే.. ప్ర‌శాంత‌త దానిక‌దే వ‌స్తుంద‌ని విదేశీయులు భావిస్తున్నారు. వారి భావ‌న నిజ‌మే అయిన‌ప్ప‌టికీ... ఇటీవ‌లి కాలంలో దొంగ బాబాల సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. ఎంత‌గానంటే... సేవ‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన స‌త్య‌సాయి బాబా లాంటి వారికి కూడా చెడ్డ పేరు తెచ్చేంత‌గా.

ఎంత‌మంది దొంగ బాబాలు వ‌చ్చినా స‌త్య‌సాయి బాబాకు ఇమేజ్ ఇసుమంత కూడా చెక్కు చెద‌ర‌దు గానీ... దొంగ బాబాల సంఖ్య పెరిగే కొద్దీ వారి చేతిలో మోస‌పోతున్న ప్ర‌జ‌ల సంఖ్య కూడా పెరుగుతుంది క‌దా. ఇదే మ‌నంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేసే అంశంగా నిలుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా గుర్మీత్ బాబా త‌ర‌హాలో మ‌న దేశ ఆధ్యాత్మిక‌త‌కు మచ్చ తెచ్చిన దొంగ బాబాలు ఇప్పుడు ఎంత మంది ఉన్నార‌న్న విష‌యాన్ని ఓ సారి పరిశీలిస్తే... ఈ జాబితా చాలా పెద్ద‌దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వీరిలోనే మ‌రింత పెద్ద బురిడీ బాబాలుగా పేరుగాంచిన టాప్ 5 బాబాల గురించి తెలుసుకుందాం.

1. రాక్ స్టార్‌... గుర్మీత్ బాబా!: ఈ జాబితాలో రేపిస్ట్ బాబాగా కోర్టు తేల్చిన గుర్మీత్ బాబాదే అగ్ర‌స్థానం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇద్ద‌రు సాద్వీల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు నిరూపిత‌మైన గుర్మీత్ పై రెండు హ‌త్యారోప‌ణ‌లు కూడా ఉన్నాయి. గ‌తంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గుర్మీత్ ఆర్థిక ప‌రంగానూ బాగానే బ‌ల‌ప‌డ్డారు. త‌న‌ను తాను రాక్ స్టార్ బాబాగా అభివ‌ర్ణించుకునే గుర్మీత్‌... దేవుడిని తానేనంటూ ఏకంగా ఓ సినిమానే తీసి సంచ‌ల‌నం రేపారు. తాజాగా నేడు ఆయ‌న‌ను రేపిస్టుగా కోర్టు తేల్చేయ‌డంతో ఆయ‌న ఇక జైలు ఊచ‌లు లెక్కించాల్సిందే.

2. రాధేమా... దుర్గా అవ‌తార‌మ‌ట‌!: స‌న్యాసినిగా ఉంటూ ఆప‌ద‌లో ఉండే వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని కొత్త అవ‌తార‌మెత్తిన సుఖ్వీంద‌ర్ సింగ్ అనే మ‌హిళ‌... ముంబైని కేంద్రంగా చేసుకుని రాధేమా గా అవ‌తారం ఎత్తిన వైనం మ‌న‌కు తెలిసిందే. అద‌న‌పు క‌ట్నం కోసం వేధించాలంటూ త‌న భ‌ర్త‌, అత్తామామ‌ల‌ను రాధేమా ఆదేశించిందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో దుర్గా అవ‌తార‌మ‌ని చెప్పుకునే రాధేమా అస‌లు విష‌యం వెలుగు చూసింది. స‌న్యాసినిగా ఉంటూనే... ఆధునిక దుస్తులు - ఆభ‌ర‌ణాలు - అలంక‌ర‌ణ‌ల‌తో ఇట్టే స్టార్ హీరోయిన్‌ ను త‌ల‌పించే రీతిలో క‌నిపించే రాధేమా.. అద‌ర‌గొట్టే స్టెప్పుల‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోల‌తో అడ్డంగా బుక్కైంది. ఆ త‌ర్వాత ఓ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేస్తానంటూ గుజ‌రాత్‌కు చెందిన ఓ కుబుంబాన్ని రాధేమా న‌ట్టేట ముంచేసింది. రాధేమా మాట‌లు విని కోట్లు త‌గ‌లేసిన ఆ కుటుంబంలోని ఏడుగురు ఆ త‌ర్వాత మరోమార్గం క‌నిపించక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

3. లేవ‌నేని స్థితిలో ఉన్నా... ఆశారాం బాపు యావంతా అటే!: నిజ‌మే... అప్ప‌టికే వ‌రుస అత్యాచారాల ఆరోప‌ణ‌ల‌తో జైలులో కాలం వెళ్ల‌దీస్తున్న ఆశారాం బాపు... ఓ సారి ఆసుప‌త్రికి వ‌చ్చిన స‌మ‌యంలో అక్క‌డి న‌ర్సును చూసి కొంటె కామెంట్లు చేశాడ‌ట‌. క‌నీసం కుర్చీలో నుంచి లేచి నిల‌బ‌డ‌లేని స్థితిలో ఉన్న ఆశారాంకు ఇదేం పాడు బుద్దో అర్థం కాక అక్క‌డి న‌ర్సుల‌తో పాటు పోలీసులు కూడా షాక్ తిన్నార‌ట‌. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు హ‌ర్యానా - రాజ‌స్థాన్‌ - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ - గుజ‌రాత్ త‌దిత‌ర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్య‌లో అనుచ‌రుల‌ను క‌లిగిన ఆశారాం బాపు త‌న ఆశ్ర‌మానికి వ‌చ్చిన ఓ మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డి... అదే కేసులో జైలు ఊచ‌లు లెక్కిస్తున్నారు. చిన్న పిల్ల‌ల‌పై లైంగిక అకృత్యాలు - హ‌త్య‌లు ఆశారాం బాపు ఇమేజీని మ‌స‌క‌బార్చేశాయి. ఇక ఆశారాం బాపు బాట‌లోనే న‌డిచిన ఆయన కుమారుడు నారాయ‌ణ్ సాయిపై కూడా ప‌ది కేసులున్నాయ‌ట‌.

4. నిత్యానంద‌దీ... ఆశారాం స్టైలే!: ఇక ద‌క్షిణ భార‌త దేశానికి వ‌స్తే... త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌కతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడ‌క్కడా మంచి పేరు సంపాదించుకున్న స్వామి నిత్యానంద.. ఆ త‌ర్వాత పెను వివాదంలో కూరుకుపోయారు. ఓ ప్ర‌ముఖ సినీ న‌టితో స‌ర‌స స‌ల్లాపాల్లో మునిగి తేలిన నిత్యానంద‌కు సంబంధించిన ఓ వీడియో 2010లో పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఇక ఆశారాం లాగే నిత్యానంద‌పైనా ప‌లు రేప్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే తాను అస‌లు లైంగిక ప‌టుత్వ‌మే లేద‌ని, అలాంటి తాను అత్యాచారాల‌కు ఎలా పాల్ప‌డ‌గ‌ల‌నంటూ పోలీసులు, కోర్టుల‌కు కొత్త స‌వాల్ విసిరిన నిత్యానంద‌పై ఏకంగా లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌లు కూడా జ‌రిగాయి. జ‌నాన్ని స‌న్మార్గంలో న‌డిపేందుకు ఆశ్ర‌మాలు న‌డుపుతున్నానంటూ చెప్పిన నిత్యానంద ఇలా లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌ల్లోనూ అడ్డంగా బుక్కైన వైనం ఏ ఒక్క‌రూ మరిచిపోలేనిదే.

5. సొంత సైన్యం ... సంత్ రాంపాల్ స్పెషాలిటీ!: నిజ‌మే... దేశంలో ఏ ఒక్క బాబా కూడా సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఒక్క సంత్ రాంపాల్ మినహా. హిసార్ స‌మీపంలో స‌త్ లోక్ ఆశ్ర‌మం పేరిట ఓ ఆధ్మాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న సంత్ రాంపాల్ అక్క‌డి జ‌నాన్ని బాగానే ఆక‌ట్టుకున్నాడు. క్ర‌మంగా కోట్లకు ప‌డ‌గ‌లెత్తిన రాంపాల్ దానిని కాపాడుకునేందుకు ఏకంగా సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓ భూ వివాదంలో త‌న‌ను అరెస్ట్ చేసేందుకు వ‌చ్చిన పోలీసుల‌ను ఆయ‌న త‌న సొంత సైన్యంతో నిలువ‌రించారు. ఇక రాంపాల్ ఆట క‌ట్టించేందుకు పోలీసులు ఏకంగా శ‌త్రు దేశంపై దాడి చేసిన త‌ర‌హాలో మూకుమ్మ‌డి దాడి చేయాల్సి వ‌చ్చింది. 2014లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాంపాల్ ముర్ఖ‌త్వాన్ని చాటి చెప్పింది.