Begin typing your search above and press return to search.

లఖీంపూర్ ఖేరీ ఘోరంపై టాప్ 5 అప్డేట్స్

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:10 AM GMT
లఖీంపూర్ ఖేరీ ఘోరంపై టాప్ 5 అప్డేట్స్
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లఖీంపూర్ ఖేరీ దారుణంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని అధికారపక్షం పూర్తిస్థాయిలో ఆత్మరక్షణలో పడిపోయింది. అయినప్పటికీ.. మోడీ సర్కారు మాత్రం దీనిపై మాట్లాడకుండా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మోడీ సర్కారు మౌనంపై విపక్షాలు మరింత ఘాటుగా రియాక్టు అవుతున్నాయి. మంగళవారం ఈ ఉదంతంపై పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ ఉదంతంపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రియాంక వాద్రాను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. రెండు రోజులుగా ఆమెను హౌస్ అరెస్టు చేసి ఉంచేయటం ఒక ఎత్తు అయితే.. బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ ఎంట్రీ ఇవ్వటంతో.. వాతావరణం మరింత వేడెక్కింది.

ఇదిలా ఉంటే.. విమానాశ్రయంలో తనను అడ్డుకున్న అధికారుల తీరును తప్పు పట్టారు రాహుల్ గాంధీ. నిరసనను చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. రాహుల్ ను బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు యోగి సర్కారు ఓకే చెప్పేసింది. మంగళవారం ఈ దారుణం గురించి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో కీలకమైన 5 పరిణామాల్నిచూస్తే..

1. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హింసాత్మక ఘటనలకు సంబంధించి.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు టీంను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదనపు ఎస్పీ నేత్రత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మరికొందరి పేర్లు సైతం ఎఫ్ ఐ ఆర్ లో నమోదు అయినట్లుగా చెప్పారు.

2. హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించిన రైతు గుర్విందర్ సింగ్ డెడ్ బాడీకి అధికారులు మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోస్టుమార్టం ప్రక్రియను రికార్డు చేశారు. అయితే.. గాయాల కారణంగా నలుగురు రైతులు మరణించినట్లుగా పేర్కొన్నారు. దీనిపై గుర్విందర్ సింగ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆమె డెడ్ బాడీకి మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు.

3. లఖింపుర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో మరణించిన నలుగురు రైతులు.. ఒక రిపోర్టర్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన సీఎంలు స్పందించారు. పంజాబ్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

4. లఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసను చూస్తే జలియన్ వాలా బాగ్ నరమేధాన్ని తలపిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపిన వారిని రక్షించేందుకు మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోందని ఢిల్లీరాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని ఇంతవరకు అరెస్టు చేయలేదంటూ కొత్త విషయాన్ని ప్రస్తావించారు.

5. విపక్ష నేతల్ని లఖింపుర్ ఖేరీకి వెళ్లకుండా విపక్ష నేతల్ని అడ్డుకోవటం ఏమిటంటూ శివసేన మండిపడుతోంది. ఉత్తరప్రదేశ్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? ఇదేమైనా కొత్త తరహా లాక్ డౌనా? ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మలా మారింది. ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. పరామర్శ కోసం వచ్చిన రాహుల్ ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకూ వారే నేరం చేశారు అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. దేశంలో కొత్త రాజ్యాంగం నడుస్తోందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.