Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలో వేగంగా అభివృద్ధి న‌గ‌రాల‌న్నీ మ‌న ద‌గ్గ‌రే

By:  Tupaki Desk   |   9 Dec 2018 12:14 PM GMT
ప్ర‌పంచంలో వేగంగా అభివృద్ధి న‌గ‌రాల‌న్నీ మ‌న ద‌గ్గ‌రే
X
ఆక్స్‌ ఫర్డ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో 2019-35 కుగాను జరిగిన ఈ గ్లోబల్ ఎకనామిక్ రిసెర్చ్ నివేదికలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. 2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీడీపి కలిగిన నగరాల్లో 9.17 శాతంతో సూరత్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి రెండు స్థానాల్లో ఆగ్రా (8.58 శాతం) - బెంగళూరు (8.50 శాతం) ఉన్నాయి. టాప్-10లో నాగ్‌ పూర్ (8.41 శాతం) - తిరుప్పూర్ (8.36 శాతం) - రాజ్‌ కోట్ (8.33 శాతం) - తిరుచ్చి (8.29 శాతం) - చెన్నై (8.17 శాతం) - విజయవాడ (8.16 శాతం) ఉన్నాయి. భారతీయ నగరాలు కాకుండా చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిదాయక నగరాల్లో నాం ఫే మొదటి స్థానంలో ఉంది.

జీడీపీ పరంగా ఉత్తర అమెరికా - ఐరోపా నగరాలపై ఆసియా దేశాల నగరాల పెత్తనానికి 2027లో బీజం పడుతుందని తాజా నివేదిక అభిప్రాయపడింది. అన్ని ఉత్తర అమెరికా - యూరోపియన్ దేశాల నగరాల జీడీపీతో పోల్చితే ఆసియా నగరాలన్నింటి జీడీపీ అధికంగా ఉంటుందని పేర్కొన్నది. ముఖ్యంగా భారత్ పాత్ర కీలకమని - అందులోనూ హైదరాబాద్ - బెంగళూరు - చెన్నైలదే హవా అని వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ జీడీపీ వృద్ధిరేటులో ఆసియా దేశాలే కీలకమని ఆక్స్‌ ఫర్డ్ ఎకనామిక్స్ తేల్చిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే పదిహేనేండ్లలో జీడీపీ పరంగా అత్యంత వృద్ధిదాయక నగరాల అంచనాల్లో హైదరాబాద్ కూడా ఉంది. టాప్-20 నగరాల్లో భారత్‌ కు చెందినవే 17 ఉండగా - అందులో భాగ్యనగరానికి నాలుగో స్థానం లభించడం గమనార్హం.

2035లోనూ ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ ఎకానమీగా న్యూయార్క్ నగరమే ఉంటుందని తాజా నివేదిక చెప్పింది. ఆర్థిక, వ్యాపార సేవల రంగంలో న్యూయార్క్‌ దే పైచేయిగా ఉంటుందని పేర్కొన్నది. టోక్యో, లాస్ ఏంజిల్స్ నగరాలు వరుసగా రెండు, - మూడు స్థానాల్లో ఉంటాయని - నాలుగో స్థానంలో మాత్రం షాంఘై - లండన్‌ లు సంయుక్తంగా నిలుస్తాయని అంచనా వేసింది. కాగా, భారత్‌ లోని అన్ని నగరాల జీడీపీతో పోల్చితే చైనా నగరాలు వృద్ధిపథంలో వెళ్లనున్నాయని ఆక్స్‌ ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ రిసెర్చ్ అధిపతి రిచర్డ్ హోల్ట్ అన్నారు. ఇదిలావుంటే తాజా నివేదిక ప్రకారం 2035లో జనాభాపరంగా ముంబై నగరం ప్రపంచంలోని టాప్-10 నగరాల్లో ఒకటిగా ఉండనుంది.