Begin typing your search above and press return to search.

చంద్రబాబును మొద్దు శీను అప్పుడే చంపేసేవాడు: వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   27 Nov 2022 8:30 AM GMT
చంద్రబాబును మొద్దు శీను అప్పుడే చంపేసేవాడు: వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
X
వైసీపీ నేత, అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి... మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కొద్ది రోజుల క్రితం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ గదిలో తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఇప్పుడు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాప్తాడులో ఏర్పాటుకావల్సిన దుస్తుల పరిశ్రమ జాకీ తెలంగాణకు తరలిపోయిన సంగతి తెలిసిందే. దీనికి రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి బెదిరింపులే కారణమని ప్రధాన పత్రికల్లో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖరరెడ్డి రగిలిపోయారని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారని తెలుస్తోంది. ‘‘మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే... మొదట చంద్రబాబు కొడుకు లోకేశ్‌నే టార్గెట్‌ చేస్తాం. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని అడ్డుపెట్టుకొని మా కుటుంబం మీద, మా సోదరుడి మీద అనేక రకాలుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. వాటిని భరించలేకపోతున్నాం. రూ.వేల కోట్లు సంపాదించుకున్న సీఎం రమేశ్, సుజనా చౌదరిని చంద్రబాబు బీజేపీ దగ్గర పెట్టాడు.

మరోవైపు కమ్యూనిస్టులను పోషిస్తున్నాడు. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు. ఆయన 2 ఎకరాల రైతు. మాకు 500 ఎకరాల భూమి ఉంది. ఆయనకు వేల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా?’’ అని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్క మాట చెప్పి ఉంటే చంద్రబాబును ఇంట్లోనే మొద్దు శీను చంపి ఉండేవాడని వ్యాఖ్యానించారు. కాగా, లోకేశ్‌ పాదయాత్ర కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.