Begin typing your search above and press return to search.

తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతమందో తెలుసా?

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:30 PM GMT
తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతమందో తెలుసా?
X
వచ్చే ఏడాదియే తెలంగాణలో అసెంబ్లీ జరుగనున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల కమిషన్ ఓటర్ల సంఖ్యను లెక్కతేల్చింది. తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34891 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83207 మంది యువ ఓటర్లు ఉన్నట్టు పేర్కొంది.

ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుదిఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా.. పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు కొత్తగా స్తానం కల్పించారు. 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వివరించారు.

ముసాయిదా జాబితా ప్రకారం.. మొత్తం 1,48,58,887 మంది పురుషులు, 1,47,02391 మహిళలు, 1,654 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 2737 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15067మంది సర్వీసు ఓటర్లు కలిపితే మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు తెలంగాణలో లెక్క తేలారు. 18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 83207మంది ఉన్నారు.

షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 8 వరకూ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల పేర్లు తొలగింపుపై, ఇతర అంశాలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని వికాస్ రాజ్ సూచించారు.

కాగా ప్రతి వారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను సీఈవో ఆదేశించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని.. బూత్ లెవల్ అధికారులు బూత్ అవేర్ నెస్ గ్రూపులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.