Begin typing your search above and press return to search.

480 ఎక‌రాలు తాక‌ట్టు.. దేనికోస‌మో?

By:  Tupaki Desk   |   7 Feb 2022 10:30 AM GMT
480 ఎక‌రాలు తాక‌ట్టు.. దేనికోస‌మో?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి గురించి అంద‌రికీ తెలిసిందే. అప్పుల‌తో ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది. దీంతో రాష్ట్రాన్ని నెట్టుకురావ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ల‌కు మంచి అప్పులు చేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతే కాకుండా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అప్పుల కోసం ప్ర‌భుత్వ భూములు తాక‌ట్టు పెడుతుందని అంటున్నారు. తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వివిధ గ్రామాల ప‌రిధిలో ఉన్న సుమారు 480 ఎక‌రాల‌ను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకుల‌కు తాక‌ట్లు పెట్టిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్ చేసిన‌ప్ప‌టికీ మండ‌లంలోని స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యంలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన‌ట్లు తెలిసింది. అనంత‌వ‌రం, మంద‌డం, ఉద్ధండ‌రాయునిపాలెం, లింగాయ‌పాలెం, వెంక‌ట‌పాలెం గ్రామాల ప‌రిధిలో రైతులు భూస‌మీక‌ర‌ణ‌లో ఇచ్చిన భూమిలో సీఆర్‌డీఏ వాటాకు వ‌చ్చిన స్థ‌లాన్ని కొంత బ్యాంకుల‌కు త‌న‌ఖా పెట్టిన‌ట్లు తెలిసింది. రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఈ భూమిని తాక‌ట్లు పెట్టింద‌ని స‌మాచారం. అయితే ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు? ఏ అవ‌స‌రానికి తీసుకుంటున్నారు? అన్న విష‌యంలో స్ప‌ష్టత లేదు.

రిజిస్ట్రేష‌న్ జ‌రిగింద‌ని వాస్త‌వ‌మేన‌ని రిజిస్ట్రేష‌న్ అధికారులు ధ్రువీక‌రించారు. కానీ పూర్తి వివ‌రాలు మాత్రం వెల్ల‌డి కాలేదు. కొన్ని రోజుల క్రితం ప్ర‌భుత్వం గుంటూరు జిల్లా సంయుక్త క‌లెక్ట‌ర్‌, రిజిస్ట్రేష‌న్ అధికారుల నుంచి రాజ‌ధానిలో ప్ర‌స్తుతం స్థలాల విలువ వివ‌రాల‌ను తెప్పించుకున్న‌ట్లు తెలిసింది. ఇప్పుడు సీఆర్‌డీఏ కొత్త రుణం తీసుకుంటుందా? లేదా గ‌తంలో హ‌డ్కో రుణం కోసం త‌న‌ఖా పెట్టిన భూమిని విడిపించేందుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో భూమిని తాక‌ట్టు పెట్టిందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. రాజ‌ధానిలో తొలి ద‌శ‌లో రూ.3 వేల కోట్ల‌తో ప‌నులు చేప‌డ‌తామ‌ని ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో చెబుతోంది. బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంటామ‌ని తెలిపింది. అప్పు తీసుకున్న మూడో ఏడాది నుంచి రాజ‌ధానిలోని 481 ఎక‌రాల‌ను ద‌శ‌ల‌వారీగా 15 ఏళ్ల పాటు అమ్మేసి రుణాన్ని తీర్చేస్తామ‌ని డీపీఆర్‌లో పేర్కొంది. ఇప్పుడు ఈ రూ.3 వేల కోట్ల రుణానికే సీఆర్‌డీఏ భూమి తాక‌ట్టు పెట్టిందా? అన్న విష‌యంలో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

గ‌తంలో సీఆర్‌డీఏకు హడ్కోకు రూ.1,250 కోట్లు రుణ‌మిచ్చింది. దాని కోసం అప్ప‌ట్లో మంగ‌ళ‌గిరి స‌మీపంలో వీఎంఆర్‌డీఏ ఉన్న‌ప్పుడు లేఅవుట్లు వేసేందుకు సేక‌రించిన భూమిని సీఆర్‌డీఏ తాక‌ట్టు పెట్టింది. ఇప్పుడ‌దే భూమిలో ఎంఐజీ లేఅవుట్‌ను ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో ఈ భూమిని విడిపించాలంటే దానిపై హ‌డ్కో రుణ‌మైనా చెల్లించాలి? లేదా ప్ర‌త్యామ్నాయ భూమినైనా చూపించాలి. అందుకు ఇప్పుడు రాజ‌ధానిలోని భూమిని హ‌డ్కోకే సీఆర్‌డీఏ రిజిస్ట్రేష‌న్ చేసింద‌న్న అభిప్రాయం ఉంది.