Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్టు: రాజమండ్రిరూరల్ లో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   18 March 2019 8:39 AM GMT
గ్రౌండ్ రిపోర్టు: రాజమండ్రిరూరల్ లో గెలుపెవరిది?
X
అసెంబ్లీ సీటు : రాజమండ్రి రూరల్
టీడీపీ అభ్యర్థి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి (సిట్టింగ్ ఎమ్మెల్యే)
వైసీపీ అభ్యర్థి: ఆకుల వీర్రాజు
జనసేన అభ్యర్థి : కందుల దుర్గేష్

రాజమండ్రి రాజకీయం రసకందాయంలో పడింది. తెలుగు రాష్ట్రాల్లోని అతి కీలకమైన ఈ సీటులో ముగ్గురూ బలమైన అభ్యర్థులే బరిలో ఉండడంతో గెలుపు ఎవరిదనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ముగ్గురూ ఆర్థికంగా బలంగా ఉన్నారు. అందుకే రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటులో ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఆటలో అరటిపండులా జనసేన రంగ ప్రవేశంతో రాజమండ్రి రూరల్ సీటులో ద్విముఖ పోరు కాస్తా త్రిముఖ పోరుగా రూపాంతరం చెందింది. ఆంధ్రప్రదేశ్ లోనే జనసేన నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి. ఇక్కడ జనసేన అభ్యర్థి టీడీపీ- వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో ఉండడం విశేషం. ఇక్కడ ప్రబలంగా ఉన్న కాపు ఓట్లే కీలకంగా ఉన్నాయి. వారే ఈ ఎన్నికల్లో వైసీపీ - జనసేన ఓట్ల చీలికకు కారణమవుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఇదే పరిణామం మేలుచేస్తోంది.

* ఎవరి బలం ఎంత.?

టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి టీడీపీ నుంచే బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి గత సారి బుచ్చయ్య మీద పోటీచేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజు మరోసారి వైసీపీ నుంచే అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక ఇది వరకు కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉండి మాజీ ఎమ్మెల్సీగా ఉన్న కందుల దుర్గేష్ 2014లో రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోవడం సైలెంట్ అయ్యారు. కానీ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో చేరిన కందుల దుర్గేష్ కు ఆది నుంచి నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. ఆయన టీడీపీ - వైసీపీలకు దడ పుట్టిస్తున్నారు.

*వైసీపీ గాలి పనిచేస్తుందా.?

సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన బుచ్చయ్య చౌదరి పోయిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పుడు బాగా ఖర్చుపెట్టినా వీర్రాజు గెలవలేకపోయారు. కానీ ఈసారి వైసీపీ గాలి వీస్తున్న నేపథ్యంలో వీర్రాజు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

*రాజమండ్రి రూరల్ స్వరూపం ఇదీ..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లో 2,37,00 మంది ఓటర్లున్నారు. ఇందులో 65శాతం పోలింగ్ జరిగింది. గెలిచిన టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 18వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచాడు. కానీ ఈసారి ఫ్యాన్ గాలి ఊపులో వీర్రాజు గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటులో ప్రధానంగా రాజమండ్రి రూరల్ - కడియం మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రెండూ దేనికదే ప్రత్యేకం. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యకు విశేష బలం ఉంది. టీడీపీకి బలమున్న మండలంగా రూరల్ పేరొందింది. ఇక్కడ బీసీల ప్రాబల్యం అధికంగా ఉంది. ఇక కడియం మండలంలో వీర్రాజు సామాజికవర్గమైన కాపు ప్రాబల్యం ఎక్కువ. కడియం మండలంలో జనసేన అభ్యర్థి దుర్గేష్ హవా కనిపిస్తోంది. ఆయన బలమైన నేతగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికే చెందిన దుర్గేష్ కు కాపు ఓటు బ్యాంకుతో పాటు మంచి కేడర్ ఇక్కడ ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. జనసేన అభ్యర్థి దుర్గేష్ కాపు ఓట్లను చీల్చి వైసీపీ అభ్యర్థి వీర్రాజును దెబ్బతీస్తున్నారన్న అంచనాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ వెనుకబడడానికి జనసేన ఓట్లే చీలికే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

* రాజమండ్రి రూరల్ లో గెలుపు ఎవరిదీ.?

రాజమండ్రి రూరల్ లో సర్వే చేసినప్పుడు ప్రధానంగా రూరల్ మండలంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోటీ కనిపిస్తోంది. ఇక కడియం మండలంలో టీడీపీ వర్సెస్ జనసేన పోటీ నెలకొంది. కడియంలో వైసీపీ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తంగా ఓటర్ల అభిప్రాయాలతో విశ్లేషించినప్పుడు టీడీపీ బుచ్చయ్య చౌదరికి జనసేన దుర్గేష్ కి మధ్య పోటీ నెలకొందని అంచనా.. జనసేన లేకపోతే ఈ సీటు 100శాతం వైసీపీ గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు ఘంఠాపథంగా చెబుతున్నారు. జనసేన దుర్గేష్ పోటీ వల్ల ఓడిపోయే అవకాశాలున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య గెలుపు సాధ్యమవుతుందన్న ధీమా వ్యక్తమవుతోంది. అంతిమంగా రాజమండ్రి రూరల్ పరిస్థితులు బట్టి టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమంటున్నారు.

*అంతిమంగా కాపులే కీలకం..

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాపు సామాజికవర్గం మెజారిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం రాజమండ్రి రూరల్. ప్రస్తుతం చంద్రబాబు తమను మోసం చేశాడని కాపులు అంతా గుర్రుగా ఉన్నారు. వారు వైసీపీ అభ్యర్థికే వేసే చాన్స్ ఉంది. కానీ కాపుసామాజికవర్గ మరో నేత బరిలో ఉన్నచోట ఓట్ల చీలిక అవుతోంది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీలోని కడియం మండలంలో నర్సరీలతో అంతా డబ్బున్న ప్రాంతంగా పేరొందింది. సో ఇక్కడ కాపుల ప్రాబల్యం వైసీపీ - జనసేనకు చీలడం వల్ల మళ్లీ కమ్మ సామాజికవర్గ బుచ్చ చౌదరికి ప్లస్ అవుతుందంటున్నారు.. గెలవాల్సిన వైసీపీ అభ్యర్థి వీర్రాజుకు జనసేన వల్లే మైనస్ అవుతోంది. జనసేన అభ్యర్థికి కూడా గెలుపు అవకాశాలున్నాయి. గ్రౌండ్ రిపోర్టు ప్రకారం.. టీడీపీ గెలవడానికి 40శాతం చాన్స్ ఉండగా.. మిగతా 30శాతం వైసీపీకి - 30శాతం జనసేనకు గెలుపు చాన్స్ ఉందని తేలింది.