Begin typing your search above and press return to search.

కృష్ణాన‌దిలో బోటు ప్ర‌మాదం...19 మంది మృతి

By:  Tupaki Desk   |   12 Nov 2017 5:10 PM GMT
కృష్ణాన‌దిలో బోటు ప్ర‌మాదం...19 మంది మృతి
X
కృష్ణా జిల్లాలో విహార యాత్ర విషాదంగా మారింది. కృష్ణా నదిలో పడవ బోల్తాపడింది. భవాని ఐలాండ్ నుంచి పవిత్ర సంగమం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 19 మంది మృత దేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఏడుగురు మ‌హిళ‌లు ఉన్నారు. ఈ ఘటనలో ఓ మహిళను ఎన్డీఆర్ ఎఫ్ దళాలు సురక్షితంగా కాపాడాయి. అయితే, ఆమె భర్త మాత్రం ఆమె కళ్లముందే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది. ఓ టీవీ ఛానల్ ప్రతినిధి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా మాట్లాడే స్థితిలో తాను లేనంటూ కంటతడి పెట్టారు. అయినప్పటికీ ఘటనకు సంబంధించి కొంత సమాచారాన్ని ఆమె అందించారు.

విజయవాడలో చోటు చేసుకున్న ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తుల ద్వారా వెలువడిన స‌మాచారం ప్ర‌కారం...వీరంతా ఒంగోలు వాకర్స్ క్లబ్ తరపున వచ్చారు. దాదాపు 38 మంది బృందం భవానీ ఐలాండ్స్ వద్ద, అప్పటికే సమయం అయిపోవడంతో ఏపీ టూరిజం బోటు సిబ్బంది వారిని ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో, వీరు ప్రైవేటు బోటులో ఎక్కారు. ఈ సందర్భంగా లైఫ్ జాకెట్లు కావాలని బాధితులు బోటు సిబ్బందిని అడిగారు. కానీ బోటు సిబ్బంది లైఫ్ జాకెట్లను ఇవ్వలేదు. ప్రమాదానికి ముందే రెండు, మూడు సార్లు కుదుపులు వచ్చాయని ఓ బాధితుడు తెలిపారు. ఆ తర్వాత ఓ మట్టి దిబ్బను ఢీకొట్టడంతో బోటు ఓ వైపుకు ఒంగిపోయిందని, దీనివల్ల ప్రయాణీకులు ఓ పక్కకు రావడం వల్ల బోటు బోల్తా పడిందని కూడా తెలుస్తోంది. బోటు డ్రైవర్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అంటున్నారు.బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదానికి ప్రైవేటు బోటు యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అర్థమవుతోంది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లను అందించి ఉంటే, అందరూ ప్రాణాలతో బయటపడేవారని తెలుస్తోంది.

మ‌రో రెండు మృత‌దేహాల కోసం ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది వెతుకుతున్నారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌లు చొప్పున ప్ర‌భుత్వం ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు బోల్తా ప‌డిన ప‌డ‌వ‌ను ఒడ్డుకు తీసుకువ‌చ్చేందుకు సిబ్బంది చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మంత్రులు, అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.