Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డికి ప్రమోషన్ రేవంత్ ఘనతనా?

By:  Tupaki Desk   |   10 July 2021 8:30 AM GMT
కిషన్ రెడ్డికి ప్రమోషన్ రేవంత్ ఘనతనా?
X
తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కావడం.. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం.. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ దక్కడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ క్రమంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై నోరుపారేసుకోగా.. మంత్రి కేటీఆర్, హరీష్ లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఇక తాజాగా కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటిదాకా కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ రావడానికి తానే కారణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు తాను చేపట్టడంతో తనను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కిషన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ఆ పదవి ఇచ్చారని అన్నారు.

రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 'నా రూపంలో తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. నన్ను ఎదుర్కోవాలంటే తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం కూడా బలంగా ఉండాలని కేంద్రం పెద్దలు భావించి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారని' రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ సోనియాను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు. కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయరని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ తొలి టర్మ్ లో అసెంబ్లీని రద్దు చేసి మరీ 6 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇది రాసిపెట్టుకోండి అని రేవంత్ రెడ్డి సవాల్ చేయడం చూస్తుంటే ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

ఇక నిన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తనపై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడు ఎలానో.. అలా తాను కాంగ్రెస్ కు అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరే ముందు టీడీపీ పదవులన్నింటికి రాజీనామా చేశానని.. అసెంబ్లీ జీతం పడే ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీకే వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు మంత్రులుగా కూడా ఉన్నారని అన్నారు. పార్టీ వల్లనే తనకు ఈ పదవి వచ్చింది కాబట్టి తన రాజీనామాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చానని రేవంత్ అన్నారు.

ఇక మంత్రి హరీష్ రావు కామెంట్లపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబే తెలంగాణ పీసీసీ పదవి ఇప్పించారని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. హరీష్ బ్రతుకే కాంగ్రెస్ అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును మంత్రిని చేసిందని కాంగ్రెస్ అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ అయితే టీఆర్ఎస్ కూడా టీడీపీనే అని విమర్శించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తలసాని, మల్లారెడ్డి, గంగుల వీరంతా టీడీపీ నుంచి వచ్చి చేరిన వారేనని అన్నారు.అటు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లపై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గాలివాటుగా గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించారు. కాబట్టి ఆ పార్టీ ఎప్పుడైనా పేకమేడలా కూలిపోవచ్చని అన్నారు.