Begin typing your search above and press return to search.

కోమ‌టి రెడ్డిపై పంతం నెగ్గించుకోబోతున్న రేవంత్‌..!

By:  Tupaki Desk   |   23 Jun 2022 1:30 AM GMT
కోమ‌టి రెడ్డిపై పంతం నెగ్గించుకోబోతున్న రేవంత్‌..!
X
కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు టీపీసీసీ అధ్య‌క్షుడు షాక్ ఇవ్వ‌బోతున్నారా..? వారిపై త‌న పంతం నెగ్గించుకునేందుకు స‌మ‌యం కోసం వేచి చూస్తున్నారా..? పార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లకు ధైర్యం ఇవ్వ‌నున్నారా..? అంటే పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే అనిపిస్తోంది. రేవంత్ త్వ‌ర‌లోనే వారి జిల్లాలో ప‌ర్య‌టించి త‌న ప‌ట్టు నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

కోమ‌టి రెడ్డి సోద‌రుల‌కు, రేవంతుకు మ‌ధ్య వ్య‌వ‌హారాలు మొద‌టి నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న విష‌యం తెలిసిందే. రేవంతుకు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో అసమ్మ‌తి కాస్తా ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. రేవంతుపై కోమ‌టి రెడ్డి సోద‌రులు చిందులు తొక్కారు. ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్లిన వ్య‌క్తికి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని.. ఓటుకు నోటు లాగానే పీసీసీ ప‌ద‌విని రేవంత్ కొనుక్కున్నాడ‌ని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు.

అక్క‌డితో ఆగ‌కుండా రేవంత్ ఆ ప‌ద‌విలో ఉన్నంత వ‌ర‌కు గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌బోన‌ని శ‌ప‌థం చేశారు. ప‌నిలో ప‌నిగా పార్టీలో అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని త‌యారు చేసుకున్నారు. జ‌గ్గారెడ్డి, వీహెచ్‌, భ‌ట్టి త‌దిత‌ర సీనియ‌ర్లు కూడా రేవంతును వ్య‌తిరేకించి కోమ‌టి రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లికారు. ఒక ద‌శ‌లో తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోతుందా అనే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే రాహుల్ గాంధీ వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హించి సీనియ‌ర్ల‌ను శాంతింప‌జేశారు.

అప్ప‌టి నుంచీ పార్టీలో అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపించ‌డం లేదు. అడ‌పాద‌డ‌పా ఉన్నా అవి అంత‌ర్గ‌త వేదికల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. అయితే రేవంత్ ఆయా జిల్లాల్లో సీనియ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంతో మ‌ళ్లీ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వ‌రంగ‌ల్ లో రాహుల్ నిర్వ‌హించిన రైతు డిక్ల‌రేష‌న్ స‌భ ద్వారానే ఈ లుక‌లుక‌లు వెలుగుచూశాయి.

ముఖ్యంగా.. రేవంత్ న‌ల్ల‌గొండ జిల్లా ప‌ర్య‌ట‌న ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. రాహుల్ స‌భ‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం రేవంతు జిల్లాకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అది తాము చూసుకుంటామ‌ని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో జిల్లా ద్వితీయ శ్రేణి నేత‌లు ఒక్కసారిగా కోమ‌టి రెడ్డి సోద‌రుల‌పై ఫైర్ అయ్యారు. త‌మ‌ను ఎద‌గ‌నీయ‌కుండా జిల్లాను వారే క‌బ్జా చేస్తున్నార‌ని ఆరోపించారు. అపుడు రేవంత్ మ‌ధ్యే మార్గంగా న‌ల్ల‌గొండకు వెళ్ల‌కుండా జానారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌మైన సాగ‌ర్ లో స‌మావేశం పెట్టుకున్నారు.

కానీ.. మ‌ళ్లీ తాజాగా రేవంత్ న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్నారు. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మునుగోడులో ప‌ర్య‌ట‌న‌కు సిధ్దం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల మునుగోడుకు చెందిన ద్వితీయ శ్రేణి నేత‌లు రేవంతుతో స‌మావేశ‌మై నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం చేయాల‌ని సూచించార‌ట‌. రాజ‌గోపాల్ రెడ్డి పార్టీలో ఉన్నారో లేదో తెలియ‌డం లేద‌ని.. త్వ‌ర‌లో బీజేపీలో చేరిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని.. కార్య‌క‌ర్త‌ల్లో మ‌నోధైర్యం నింపేందుకు మునుగోడుకు రావాల‌ని ఆహ్వానించార‌ట‌. దీంతో రేవంత్ సానుకూలత‌ వ్య‌క్తం చేశార‌ట‌. మ‌రి దీనిపై కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.