Begin typing your search above and press return to search.

రేవంత్ దూకుడు సొంత పార్టీలోనే శత్రువుల‌ను పెంచుతోందా?

By:  Tupaki Desk   |   6 March 2022 11:30 AM GMT
రేవంత్ దూకుడు సొంత పార్టీలోనే శత్రువుల‌ను పెంచుతోందా?
X
తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థిగా ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల ఐఏఎస్ అధికారుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ అధికారుల ఆదిప‌త్యం కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. అయితే, ఈ కామెంట్ల‌పై కాంగ్రెస్‌కు చెందిన సీనియ‌ర్లే ఘాటుగా స్పందిస్తున్నారు. టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ తాజాగా ఈ కామెంట్ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌తో పాటుగా మ‌రో సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు సైతం త‌ప్పుప‌ట్టారు.

గత కొంత కాలంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను టార్గెట్‌ చేస్తుండ‌టంపై మ‌ధుయాష్కీ ప‌రోక్షంగా స్పందిస్తూ అవినీతిలో ఆంధ్ర లేదా బీహార్ అధికారి అని ఉండదు అని అన్నారు. తెలంగాణ ఐఏఎస్ లకు పదవులు ఇచ్చేది సీఎం కదా..? అని ప్రశ్నించారు.

ఒక్కో అధికారికి అన్ని శాఖలు ఇచ్చిన సీఎంది తప్పని అన్నారు. వైఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు అసోం క్యాడ‌ర్ ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మిల‌కు ప్రాధాన్యం ద‌క్కింద‌న్నారు. ప్ర‌స్తుత‌ డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఏఎస్ శ్రీధర్ లు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులని పేర్కొన్న యాష్కీ ఇప్పుడు కేసీఆర్‌కి సన్నిహితులుగా మారారని పేర్కొన్నారు.

ఐఏఎస్‌ల కోసం కాదు… ఉద్యోగాల ఖాళీల గురించి కొట్లాడాలన్నారు. అధికారుల గురించి ఎందుకు.. నిరుద్యోగుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని మధుయాష్కీ అన్నారు. త‌మ పోరాటం సీఎంపైనే.. కానీ, అధికారుల మీద కాదన్నారు.

మ‌రోవైపు రేవంత్‌రెడ్డి బీహార్ వాళ్లను కించ పరిచేలా మాట్లాడుతున్నారు అంటూ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో తెలంగాణ వాళ్లు పని చేయడం లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. బీహార్‌ నుంచి నాకు ఫోన్స్‌ వస్తున్నాయని తెలిపారు.. ఒక ప్రాంతం వారిని విమర్శించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.. మరి, ఆంధ్ర అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.. వాళ్ల గురించి ఎందుకు మాట్లాడడంలేదు? అని వీహెచ్ నిలదీశారు. మొత్తంగా బీహార్ అధికారుల విష‌యంలో రేవంత్ కామెంట్లు బూమ‌రాంగ్ అయ్యాయ‌ని, కాంగ్రెస్ పార్టీలోనే శ‌త్రువుల‌ను పెంచుకున్న‌ట్లుగా మారింద‌ని చెప్తున్నారు.