Begin typing your search above and press return to search.

రేవంత్ తాజా మాట.. గాంధీ ఫ్యామిలీకి కష్టం వస్తే మనందరికి వచ్చినట్లే!

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:44 AM GMT
రేవంత్ తాజా మాట.. గాంధీ ఫ్యామిలీకి కష్టం వస్తే మనందరికి వచ్చినట్లే!
X
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. సోనియా గాంధీ కుటుంబంపై తనకున్న విధేయతను ప్రదర్శించే ఏ చిన్న అవకాశాన్ని అస్సలు మిస్ కావట్లేదు. గాంధీ ఫ్యామిలీల గొప్పతనం గురించి చెప్పే విషయంలో అతగాడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి. మంచి మాటకారి అయిన రేవంత్ తాజాగా గాంధీ ఫ్యామిలీపై కీలక వ్యాఖ్య చేశారు.

గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ హెరాల్డ్ మీడియా సంస్థ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ పత్రిక విషయంలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఈడీ ఆరోపించటం.. అందుకు తగ్గట్లే రాహుల్ గాంధీనికి నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ తీరుపై స్పందించిన రేవంత్.. జాతీయ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

‘నేషనల్ హెరాల్డ్ పత్రిక యంగ్ ఇండియా ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీ జరగలేదు. కానీ.. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వటం ద్వారా భయపెట్టాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. ఈడీ కార్యాలయానికి విచారణ కోసం గాంధీ కుటుంబ సభ్యులు సోమవారం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ తీరును తప్పు పడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా నిరసన చేపట్టాలని నిర్ణయించటం తెలిసిందే.

ఈ అంశం మీద స్పందించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా శాంతియుత నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలన్నారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికి కష్టం వచ్చినట్లేనని.. తాజా ఈడీ ఉదంతంపై కాంగ్రెస్ కార్యకర్తలంతా స్పందించాలని కోరుతున్నారు. ఈడీ విచారణ పూర్తి అయ్యే వరకు ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలన్నారు. మొత్తంగా గాంధీ కుటుంబానికి కష్టం వస్తే.. ప్రజలందరికి వచ్చినట్లేనంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలిప్పుడు ఆసక్తికరంగా మారాయి.