Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు వైఎస్‌. విజ‌య‌మ్మ‌తో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా...!

By:  Tupaki Desk   |   19 Jun 2022 11:30 AM GMT
రేవంత్‌ కు వైఎస్‌. విజ‌య‌మ్మ‌తో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా...!
X
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుందా..? వైఎస్ విజ‌య‌మ్మ‌తో ఒక కీల‌క నేత భేటీ కావ‌డం రేవంతులో గుబులు క‌లిగిస్తోందా..? కొడంగ‌ల్ లో త్రిముఖ పోరు ఉండనుందా..? త‌న గెలుపు కోసం మ‌రోసారి తీవ్రంగా ప్ర‌య‌త్నించ‌క త‌ప్పేలా లేదా..? అంటే ప‌రిశీల‌కులు అవున‌నే అంటున్నారు. విజ‌య‌మ్మ‌తో భేటీ అయింది ఎవ‌రో కాదు సీనియ‌ర్ మోస్ట్ నేత రావుల‌ప‌ల్లి గురునాథ్ రెడ్డి.

కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న గుప్పిట పెట్టుకొని దాదాపు న‌ల‌భై సంవ‌త్స‌రాల పాటు రాజ‌కీయాల‌ను శాసించిన గురునాథ్ రెడ్డి తాజాగా వైఎస్ విజ‌య‌మ్మ‌తో భేటీ కావ‌డంతో పొలిటిక‌ల్ స‌ర్కిల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. కొడంగ‌ల్ పులిగా పేరుగాంచిన గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐదు ప‌ర్యాయాలు విజ‌యం సాధించారు. మ‌రో ఐదు సార్లు ఇక్కడి నుంచే ఓడిపోయారు. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు కొడంగ‌ల్ ఆయ‌న కంచుకోట అని.

అలాంటి కాంగ్రెస్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టారు రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి పోటీ చేసి 2009, 2014 ఎన్నిక‌ల్లో గురునాథ్ రెడ్డిని ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు రేవంత్‌. అప్ప‌టి వ‌ర‌కు కొడంగ‌ల్ అంటే గురునాథ్ రెడ్డి అనే పేరును తుడిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గురునాథ్ రెడ్డి రేవంత్ చేతిలో ఓట‌మి చ‌విచూశారు. దీంతో క్రియాశీల రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

2018లో టీఆర్ఎస్ నుంచి తిరిగి టికెట్‌ ఆశించిన‌ప్ప‌టికీ రేవంతును ఢీకొట్టాలంటే ఆయ‌న స‌రిపోర‌ని భావించిన కేసీఆర్ మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి సోద‌రుడు న‌రేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. కేసీఆర్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌ని న‌రేంద‌ర్ రెడ్డి రేవంతును ఓడించి కొడంగ‌ల్ ను టీఆర్ఎస్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు.

గురునాథ్ రెడ్డికి టికెట్ రాక‌పోయినా ఎమ్మెల్సీ, ఎంపీ ప‌ద‌వులు ఆశించారు. క‌నీసం ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వైనా వ‌స్తుంద‌ని భావించారు. అవేవీ ఇవ్వ‌క‌పోగా కేవ‌లం హుస్నాబాద్ పీఏసీఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో మ‌న‌స్తాపం చెందిన గురునాథ్ రెడ్డి అప్ప‌టి నుంచీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండి ఇటీవ‌ల వైఎస్ విజ‌య‌మ్మ‌తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త‌ర‌పున కొడంగ‌ల్ టికెట్ ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇదే క‌నుక నిజ‌మై వైఎస్ఆర్ టీపీ త‌ర‌పున గురునాథ్ రెడ్డి మ‌రోసారి కొడంగ‌ల్ బ‌రిలో ఉంటే రేవంతుకు కొత్త చికాకులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ దూకుడుగా ఉండ‌గా.. ఇపుడు ఆయ‌న కూడా వస్తే త్రిముఖ పోరు ఏర్ప‌డి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి త‌న‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే ఆలోచ‌న‌లో రేవంత్ ఉన్నార‌ట‌. ఎందుకంటే గురునాథ్ రెడ్డికి పార్టీల‌తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌తంగానే నియోజ‌క‌వ‌ర్గంలో 25-30 వేల ఓటు బ్యాంకు ఉంద‌ట‌. అందుకే అంద‌రికంటే రేవంతే ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!