Begin typing your search above and press return to search.

సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ శాటిలైట్ ఫొటోలు

By:  Tupaki Desk   |   29 March 2021 3:20 AM GMT
సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ శాటిలైట్ ఫొటోలు
X
ప్రపంచ వాణిజ్య కేంద్రమైన సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వాణిజ్యమే స్తంభించింది. ఈజిప్టులోని సూయజ్ కాలువలో మంగళవారం చిక్కుకుపోయిన ఎవర్ గివెన్ నౌక కారణంగా ఈ సంఘటన జరిగింది. ఫలితంగా దాదాపు 300 ఓడలు అక్కడే నిలిచిపోయాయి. క్రమంగా వాణిజ్యం స్తంభించి భారీ నష్టం జరుగుతోందని అంచనా వేశారు.

నిరంతరాయంగా చర్యలు

అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ నౌకను తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఇంతవరకు ఫలించలేదు. ఆరు రోజులుగా చర్యలు చేపట్టినా ఇంకా కేవలం 30 డిగ్రీల మేర మాత్రమే నౌకను కదిలించగలిగారు. నౌకను తీయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా బలమైన గాలులు, తీవ్ర అలల తాకిడీ వల్ల ఆ పనులకు పదే పదే అంతరాయం కలుగుతోంది. 14 టగ్ బోట్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. నౌక చుట్టూ మట్టి తవ్వుతున్నారు. అవసరమైతే నౌకలోని సరుకులు కిందకు దించాలని యోచిస్తున్నారు.

స్తంభించిన ప్రపంచ వాణిజ్యం

నిత్యం కోట్లలో వ్యాపారం జరిగే సూయజ్ కాలువ ద్వారా రవాణా స్తంభించడంతో ఆ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపైనే పడింది. వివిధ దేశాల నుంచి వచ్చే ఓడలు అక్కడే నిలిపోయాయి. కొన్ని ఓడలు దక్షిణాఫ్రికా మీదుగా వెళ్లాలని భావిస్తున్నాయి. కాకపోతే అందుకు మరో 12 రోజులు అదనపు సమయం పడుతుందనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సూయజ్ కాలువ ట్రాఫిక్ జామ్ తో రోజుకు దాదాపు రూ.70 వేల కోట్లు మేర నష్టం వాటిల్లుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇలా జరిగింది

మార్చి 23న సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకుంది. అప్పటికే వందల సంఖ్యలో ఓడలు వేచి ఉన్నాయి. ఎవర్ గివెన్ నౌక పొడవు 400మీటర్లు కాగా.. కాలువ వెడల్పు 200 మీటర్లు కావడం గమనార్హం. ఇసుక తుపాన్ - బలమైన గాలల ధాటికి నియంత్రణ కోల్పోయి నౌక అడ్డంగా ఇరుక్కుపోయి ఇసుకలో కూరుకుపోయింది.