Begin typing your search above and press return to search.
కారు ఆపితే అంత కోపం ఎందుకు జానాసాబ్
By: Tupaki Desk | 6 Dec 2015 5:00 AM GMTఎంత పెద్ద మనుషులైనా సరే.. తమ విషయంలో మాత్రం నిబంధనలకు మినహాయింపులు ఇవ్వాలని కోరుకోవటం కాస్త విచిత్రంగా ఉంటుంది. తాము అందరిలాంటి వాళ్లమేనని.. ప్రజల పుణ్యమా అని నాయకులు.. ప్రత్యేక హోదాలు వచ్చాయన్న ఆలోచనను మర్చిపోతుంటారు. ప్రజలు తమకిచ్చిన బాధ్యతను కిరీటంగా భావించి.. తామేదో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఫీలయ్యే వారు చాలామందే ఉంటారు.
అలాంటి వారిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి కూడా చేరిపోవటం కాస్తంత బాధ కలిగించే అంశం. తనను గుర్తించాలని.. తనకు గౌరవం ఇవ్వాలన్న చిత్రమైన వైఖరిని ఆయన వ్యక్తం చేయటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పోలీసులు జరిపే తనిఖీల్లో సామన్యులు.. వీఐపీలు అన్నది తేడా లేకుండా పని చేయటాన్ని స్వాగతించాలే కానీ .. నిలదీయకూడదు. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయిన జానా.. హైదరాబాద్ పోలీసుల మీద రుసరుసలాడారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి జానారెడ్డి సాబ్ కారును పోలీసులు ఆపారు. డ్రైవర్ కు తనిఖీలు నిర్వహించారు. ఇలా చేయటం జానాసాబ్ ఇగో హర్ట్ అయినట్లుంది. తన కారు మీద ఉన్న బుగ్గ కనిపించలేదా? తన కారు కూడా ఆపుతారా? అంటూ మండిపడ్డారు. కానీ.. అవేమీ పట్టించుకోని పోలీసులు తమ పని తాము కానిచ్చారు.
పోలీసులు జరిపిన పరీక్షల్లోజానారెడ్డి డ్రైవర్ మద్యం సేవించలేదని తేలటంతో సెల్యూట్ చేసి మరీ పంపారు. నాయకుడు అంటే ఆకాశం నుంచి ఉడిపడేవాడు కాదని.. అందరి లాంటి వాడేనని కాకుంటే అందరికి మార్గదర్శకుండా ఉండేవాడన్న చిన్న విషయాన్ని మర్చిపోవటమే అసలు విషాదం. జానారెడ్డి లాంటి పెద్దమనిషి.. ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని స్వాగతించి.. అభినందించి.. మంచి పని చేస్తున్నారంటూ అభినందించి హుందాగా తమ డ్రైవర్ కు పరీక్షలు జరపాలని అని ఉంటే..? ఎంత బాగుండేది. పెద్ద పెద్ద నాయకులు అయి ఉండి కూడా చిన్న చిన్న లాజిక్ లు ఎందుకు మర్చిపోతుంటారో..?