Begin typing your search above and press return to search.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ ఇంట విషాదం

By:  Tupaki Desk   |   29 April 2022 4:46 AM GMT
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ ఇంట విషాదం
X
ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి సాముల పుష్ప శ్రీవాణి ఇంట విషాదం నెలకొంది. ఆమె మామ.. సీనియర్ రాజకీయ నేత.. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. టీడీపీ నేతగా సుపరిచితుడైన ఆయన విశాఖలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన.. విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు స్వయాన సోదరుడు. చంద్రశేఖర్ రాజు విషయానికి వస్తే ఆయన 1989లో కురుపాం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇదిలా ఉంటే 2009లో ఆయన మేనల్లుడు వీటీ జనార్దన్ థాట్రాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన కోడలు పుష్పశ్రీవాణి మాత్రం 2019లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం రావటం.. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించటం తెలిసిందే.

అనంతరం ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పదవిని సొంతం చేసుకున్నారు. 2019లో టీడీపీలోకి చేరిన చంద్రశేఖర్ రాజు.. వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. ఇటీవల చంద్రశేఖర్ రాజు కుమార్తె పల్లవి కూడా టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మరణ వార్త విన్నంతనే ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా నారా లోకేశ్ పేర్కొన్నారు.