Begin typing your search above and press return to search.

రామోజీ ఇంట విషాదం.. పౌల్ట్రీ రంగ దిగ్గజం కన్నుమూత

By:  Tupaki Desk   |   29 April 2022 5:00 AM GMT
రామోజీ ఇంట విషాదం.. పౌల్ట్రీ రంగ దిగ్గజం కన్నుమూత
X
డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు అన్నంతనే చిత్తూరు జిల్లా వాసులకు సుపరిచితులు. ఈనాడు ఉద్యోగుల్లో చాలామందికి పరిచితమైన పేరు. ఎందుకంటే ఆయన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు వియ్యంకుడు. రామోజీ పెద్దకొడుకు కిరణ్ కు పిల్లను ఇచ్చిన మామే ఆయన. కిరణ్ సతీమణి.. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న శైలజా కిరణ్ తండ్రే ఆయన.

పారిశ్రామిక దిగ్గజంగా ఉన్నా.. లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం ఆయన అలవాటు. 85 ఏళ్ల వయసులో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో రామోజీ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ నెల ఆరున ఆయనకు గుండెపోటు రావటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన ఆస్తమించక తప్పలేదు.

మరణవార్త తెలిసినంతనే శైలజా కిరణ్.. ఈనాడు ఎండీ కిరణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన పార్థిప దేహాన్ని హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

పశువైద్యుడిగా కెరీర్ షురూ చేసిన సుందరనాయుడు.. కోళ్ల పరిశ్రమ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ రంగం భారీ ఎత్తున డెవలప్ కావటంలో విశేషంగా కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి.. దాన్ని భారీ ఎత్తుకు తీసుకొచ్చిన తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఆయనే కీలకంగా చెప్పొచ్చు.

చిత్తూరులో బాలాజీ హేచరీస్ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన.. ఎంతోమందికి స్ఫూర్తిదాత.ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు శైలజ కాగా మరొకరు నీరజ. శైలజ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఫౌల్ట్రీ రంగంలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆయన శాశ్వితంగా వెళ్లిపోవటం.. ఆ రంగానికి తీరని లోటుగా చెప్పక తప్పదు.