Begin typing your search above and press return to search.

టెక్సాస్ లో విషాదం: ఒకే ట్రక్కుల్లో 46కి పైగా మృతదేహాలు

By:  Tupaki Desk   |   28 Jun 2022 7:00 AM GMT
టెక్సాస్ లో విషాదం: ఒకే ట్రక్కుల్లో 46కి పైగా మృతదేహాలు
X
అమెరికాలో ఇది వలసల విషాదంగా చెప్పొచ్చు. అత్యంత దారుణ సంఘటనగా అభివర్ణించవచ్చు. ఈ వలసలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో సోమవారం జరిగిన ఒక భయంకరమైన.. విషాదకరమైన సంఘటనలో 46 మంది వలసదారులు చనిపోవడం తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం ఒక ట్రక్కు కంటైనర్ లో చనిపోయారు. కంటైనర్ లో కనిపించిన మరో 16 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఇది అమెరికా-మెక్సికో సరిహద్దులో అత్యంత ఘోరమైన మానవ స్మగ్లింగ్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ ఘటన నుంచి బయటపడిన వారి శరీర ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అస్వస్థతకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటన వెలుగుచూసిన ప్రదేశం అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్లు దూరంలో ఉంది.

శాన్ ఆంటోనియో ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కులో నీటి ఆనవాలు లేవు. అందులో భారీగా మృతదేహాలను కనుగొన్నారు. నగరం యొక్క దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ట్రక్కు కనుగొనబడింది.

గాయపడిన వారిలో నలుగురు మైనర్లు ఉన్నారని, అయితే మృతుల్లో పిల్లలు లేరని అధికారులు తెలిపారు. ఎండవేడిమితో రోగులు తీవ్ర అవస్థలు పడి చనిపోయినట్లు చెబుతున్నారు. ఇది ఎయిర్ కండిషన్డ్ కంటైనర్ అయినప్పటికీ, అధికారులు అందులో ఏ/సి యూనిట్‌ను పనిచేయడం లేదని గుర్తించారు.దీంతో వేడికి ఊపిరి ఆడక చనిపోయారని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనాస్థలికి సమీపంలో పనిచేసే వ్యక్తికి సహాయం కోసం కేకలు వినిపించాయి. అతను ట్రక్కు దగ్గరికి వెళ్లినప్పుడు, ట్రక్కు డోర్లు పాక్షికంగా తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా నేలపై మృతదేహాలు పడి ఉన్నాయి.

ట్రక్కుల్లో చాలా మంది అచేతనంగా పడిపోయి కనిపించారు. ప్రాణాలతో ఉన్న వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ ట్రక్కులోని రిఫ్రిజిరేటర్లలో నీరు లేదు. ఏసీ పనిచేయడం లేదు. మరోవైపు శాన్ అంటినియోలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీరంతా ఊపిరాడకో.. ఎండవేడికో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

ఇటీవలి కాలంలో అమెరికా-మెక్సికో సరిహద్దులో రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు. ఈ ధోరణి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ అమలు చేస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాలపై కూడా విమర్శలకు దారితీసింది.