Begin typing your search above and press return to search.

భారత్‌ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ కన్నుమూత!

By:  Tupaki Desk   |   14 Jan 2023 7:30 AM GMT
భారత్‌ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ కన్నుమూత!
X
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం సాధించి పెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీల్లో యాత్ర ముగిసింది. ప్రస్తుతం పంజాబ్‌ లో సాగుతోంది.

కాగా భారత్‌ జోడో యాత్రకు ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిరు వ్యాపారులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ రాహుల్‌ గాంధీతో కలసి పాదయాత్రలో మమేకమవుతున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో చోటా నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు సరేసరి.

కాగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న 'భారత్‌ జోడో యాత్ర'లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న జలంధర్‌ కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం.

ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్‌ ప్రాంతంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనవరి 14న ఉదయం ఈ యాత్రలో పాల్గొని రాహుల్‌ గాంధీతో కలిసి నడిచిన జలంధర్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను సహచరులు లూధియానాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాదవార్త తెలియగానే రాహుల్‌ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి ఎంపీ భౌతిక కాయానికి నివాళులర్పించారు.

కాగా సంతోఖ్‌ సింగ్‌.. 1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొందారు.

కాగా ఎంపీ మృతి ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా ఎంపీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అదేవిధంగా పలువురు ఎంపీలు సైతం ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.