Begin typing your search above and press return to search.

హోస్టెస్ కాదు..కొత్త రైళ్లు వేయండి

By:  Tupaki Desk   |   21 Feb 2016 12:20 PM GMT
హోస్టెస్ కాదు..కొత్త రైళ్లు వేయండి
X
ప్రధాని కుర్చీలో మోడీ కానీ కూర్చుంటే దేశం రూపురేఖలు మొత్తం మారిపోతాయని.. దేశంలోని 130 కోట్ల మంది బతుకుల్లో మార్పు వస్తుందని నమ్మినోళ్లు చాలామందే ఉన్నారు. ప్రధాని పదవిని చేపట్టిన మరో మూడు నెలలకు రెండేళ్లు అయ్యే పరిస్థితి. ఇప్పటివరకూ వచ్చిన మార్పులేమిటో అందరికి తెలిసిందే. కాకుంటే.. గతంతో పోలిస్తే అవినీతి విషయంలో పెద్ద రచ్చ లేదంతే. ఇక.. ప్రజల బతుకుల్లో వచ్చే మార్పుల విషయంలో మాత్రం అసంతృప్తి గతంలో మాదిరే కంటిన్యూ అవుతోంది.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేల దశను మారుస్తారన్న అంచనాలు చాలానే వినిపించాయి. నిజమే.. రైల్వేల్లో చాలానే మార్పులు వచ్చాయి. పట్టుమని కొత్త రైళ్లు ఓ పది వేయకున్నా.. ఆ మాట చెప్పి.. ఈ మాట చెప్పి ప్రతి దానికి వాయింపు మీద వాయింపుతో జేబుల మీద భారం వేసిన పరిస్థితి. సామాన్యుడికి కావాల్సింది అవసరాలు తీర్చటమే తప్పించి.. కొత్తగా భారం మీద వేయించుకోవటం కాదు.

ఇదిలా ఉంటే.. తాజాగా రైల్వే శాఖ వినూత్న ఆలోచన ఒకటి చేసింది. దేశంలోనే తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ.. అగ్రా మధ్యన సెమీ హైస్పీడ్ రైలుబండిని నడిపించనుంది. దీనిపేరు గతిమాన్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే.. హైపవర్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం.. ఆటోమేటిక్ ఫైర్ అలారం.. స్లైడింగ్ ద్వారాలు.. లైవ్ టీవీ.. రైల్వే క్యాటరింగ్ తో పాటు.. విమానాల్లో ఎయిర్ హోస్టెస్ మాదిరి ఈ రైళ్లల్లో హోస్టెస్ ప్రయాణికులకు గులాబీ పువ్వులు ఇస్తూ స్వాగతం పలుకుతారట.

శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు కంటే ఈ రైలు టిక్కెట్టు ధర 25 శాతం అధికంగా ఉండనుంది. ధరల వాయింపును పక్కన పెడితే.. ప్రయాణికుల చేతికి గులాబీలు ఇచ్చే ఎక్స్ ట్రా సౌకర్యాల కంటే.. విపరీతమైన రద్దీ ఉన్న రూట్లలో కొత్త రైళ్లను ప్రకటిస్తే అదే పదివేలు. అలాంటివి వదిలేసి.. చేతికి గులాబీ పువ్వులు ఇచ్చే సౌకర్యాలు ఈ దేశ ప్రజలకు అవసరమా?