Begin typing your search above and press return to search.

రైలుబండే ఆసుప‌త్రి.. 64 వేల ప‌డ‌క‌ల‌తో సిద్ధం!

By:  Tupaki Desk   |   28 April 2021 4:13 AM GMT
రైలుబండే ఆసుప‌త్రి.. 64 వేల ప‌డ‌క‌ల‌తో సిద్ధం!
X
దేశంలో క‌రోనా దారుణ విల‌యం సృష్టిస్తోంది. రోజూ ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌గా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల‌కు చికిత్స అందించేందుకు ఆసుప‌త్రులు చాల‌డం లేదు. దీంతో.. ఆసుప‌త్రుల బ‌య‌ట‌నే ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రోసారి రైల్వే శాఖ రంగంలోకి దిగింది. రైలు బండ్ల‌ను కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చేందుకు సిద్ధ‌మైంది.

గ‌తేడాది రైలు బోగీల‌ను కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా ప‌లు రైలు బండ్ల‌ను క‌రోనా ట్రీట్మెంట్ కు సిద్ధం చేసింది రైల్వేశాఖ‌. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్ల‌లో కొవిడ్ కేర్ కోచ్ ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

సుమారు 4 వేల రైలు బోగీల్లో.. దాదాపు 64 వేల ప‌డ‌క‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్టు స‌మాచారం. కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ఢిల్లీలోని శ‌కుర్ బ‌స్తీ స్టేష‌న్లో 50 కోచ్ ల‌ను ఏర్పాటు చేసి, 800 బెడ్ల‌ను సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. మ‌హారాష్ట్ర‌లోని నందూర్బార్ జిల్లాలో 21 రైలు బోగీల్లో.. 378 ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. వీటితోపాటు పంజాబ్ లో 50 కోచ్ లు, జ‌బ‌ల్ పూర్ లో 20, భోపాల్ స్టేష‌న్లో 20 బోగీలు అందుబాటులోకి తెచ్చిన‌ట్టు రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. ఇంకా.. అవ‌స‌రం ఉన్న ప్రాంతాల‌కు బోగీల‌ను త‌రలించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ బోగీల్లో అన్ని సౌక‌ర్యాలూ క‌ల్పించిన‌ట్టు అధికారులు తెలిపారు. ఒక్క కోచ్ లో 16 బెడ్ల‌ను సిద్ధం చేశార‌ట‌. ప్ర‌తీ కోచ్ లో మూడు టాయిలెట్లు, దోమ తెర‌లు, ప‌వ‌ర్ సాకెట్లు, ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులో ఉంచిన‌ట్టు స‌మాచారం. ఇంకా.. బాధితుల‌కు ఫ్లూయిడ్స్ అందిచేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ బోగీల ద్వారా ఆసుప‌త్రుల‌పై కాస్త భారం త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.