Begin typing your search above and press return to search.

అగ్నిపథ్ పై నిరసన: సికింద్రాబాద్ లో రైళ్లకు నిప్పు

By:  Tupaki Desk   |   17 Jun 2022 5:35 AM GMT
అగ్నిపథ్ పై నిరసన: సికింద్రాబాద్ లో రైళ్లకు నిప్పు
X
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిలో నిరుద్యోగ యువకులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రైళ్లకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ మంటలు తెలంగాణకు పాకాయి. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొంతమంది యువకులు ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై పార్సిల్ సమాన్లు వేసి నిరసన తెలిపారు.

అగ్నిపథ్ ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు.

ఇక సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోలనకారులను అదుపులోకి తీసుకున్నారు.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ స్కీమ్ పేరుతో కేంద్రం కొత్త సర్వీసును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించింది.

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియామకాలు చేపట్టకపోవడంతో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియామకాలకు 23 ఏళ్లకు అర్హతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నాలుగేళ్ల పరిమితితో మొదటి సారి కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకం కింద తొలి బ్యాచ్ 45 వేల మందిని నియమించుకున్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ లలో ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. పాతపద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సెగ హైదరాబాద్ కు తాకింది.