Begin typing your search above and press return to search.

పోలీసు చేత యూనిఫాం విప్పించిన జ‌డ్జి.. ?

By:  Tupaki Desk   |   28 July 2019 4:47 AM GMT
పోలీసు చేత యూనిఫాం విప్పించిన జ‌డ్జి.. ?
X
సిత్ర‌విచిత్ర‌మైన ఉదంతాల‌కు వేదిక‌గా నిలుస్తుంటుంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌. ఆ రాష్ట్రంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప‌వ‌ర్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ చ‌ట్టం చ‌ట్టుబండ‌లు అయ్యేలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విమ‌ర్శ ఉంది. అంద‌రూ కాకున్నా.. ఎక్కువ మంది వ్య‌వ‌హార‌శైలి ఏ మాత్రం బాగోద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తుంటుంది. దేశంలోనే అత్యంత పెద్ద‌దైన రాష్ట్రమైన యూపీలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. సంచ‌ల‌నంగా మారింది.

ఆగ్రాలో త‌న కారుకు దారి ఇవ్వ‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఒక న్యాయ‌మూర్తి వ్య‌వ‌హ‌రించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. త‌న కారుకు దారివ్వ‌ని కానిస్టేబు ల్ ను కోర్టుకు పిలిపించి.. అత‌డి బ‌ట్ట‌లు విప్ప‌దీసి.. కోర్టు బ‌య‌ట అర‌గంట పాటు నిల‌బ‌డే శిక్ష విధించిన జ‌డ్జి తీరుపై విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తాయి.

దీనికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ కావ‌టంతో.. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర డీజీపీ దృష్టికి వెళ్లింది. కానిస్టేబుల్ ప‌ట్ల జ‌డ్జి తీరుపై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఈ ఉదంతాన్ని ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. దీంతో ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. అడిష‌న‌ల్ చీఫ్ జ్యూడీషియ‌ల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ పై చ‌ర్య‌లు తీసుకుంటూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

ఆయ‌నపై బ‌దిలీ వేటు వేశారు. మ‌హోబాలోని డిస్ట్రిక్ట్ లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి పూర్తికాల‌పు సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అంతేకాదు.. త‌మ ఆదేశాల్ని వెంట‌నే అమ‌లు చేసి.. దీనిపై రిపోర్ట్ చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు వెళ్లే స‌మ‌యంలో జ‌డ్జి కారుకు దారివ్వ‌లేద‌న్న కార‌ణంగా కానిస్టేబుల్ ఘూరేలాల్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. దారుణ‌మైన రీతిలో బ‌ట్ట‌లు విప్పించి.. కోర్టుహాల్ బ‌య‌ట అర‌గంట పాటు నిల‌బెట్టిన వైనంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.