Begin typing your search above and press return to search.

చెత్త‌ను మాయం చేసే ట్రాష్‌ గార్డ్‌!

By:  Tupaki Desk   |   17 Jun 2017 9:40 AM GMT
చెత్త‌ను మాయం చేసే ట్రాష్‌ గార్డ్‌!
X
ప్ర‌స్తుతం మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌ను వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య చెత్త డంపింగ్. రోజు కొన్ని వేల ట‌న్నుల చెత్త‌ను త‌ర‌లించ‌డం మునిసిపాలిటీల‌కు స‌వాల్‌ తో కూడుకున్న ప‌ని. విఠ‌లాచార్య సినిమాలోలాగా ఎక్క‌డి చెత్త అక్క‌డే మాయ‌మైపోతే? ఎంత బాగుంటుందో క‌దా! అటువంటి ఆలోచ‌న‌తోనే ఎక్క‌డి చెత్త‌ను అక్క‌డే మాయం చేసే వినూత్న‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు ఐఐసీటీ శాస్త్రవేత్త‌లు.

ఎక్క‌డి చెత్త‌ను అక్క‌డే మాయం చేయ‌డ‌మే కాకుండా దానిని సులువుగా శుద్ధి చేసి ఇంధనంగానూ మార్చుకోవచ్చంటున్నారు ఐఐసీటీ ముఖ్య శాస్త్రవేత్త జానీ జోసెఫ్‌. వంటగదుల్లో ఉత్పత్తయ్యే సేంద్రీయ వ్యర్థాల్ని (తడిచెత్తను) ట్రాష్ గార్డ్ అనే పరికరంలో వేస్తే, అవి దహనమై బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఆస్ట్రియా టెక్నాలజీతో రూపొందించిన‌ ట్రాష్‌ గార్డ్‌ ఒత్తిడి ఆధారంగా దానంతట అదే పనిచేస్తుంది.

బయోడైజెస్టర్‌ విధానం కింద ఆయన రూపొందించిన ట్రాష్‌ గార్డ్‌ యంత్రాన్ని 2014లో తొలిసారిగా కొచ్చిలోని ఓ అపార్టుమెంట్ వ‌ద్ద అమర్చారు.ఈ స‌రికొత్త విధానం స‌క్సెస్ కావడంతో ప్రస్తుతం 20 అపార్టుమెంట్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు.

ఈ యంత్రానికి రోజూ 50-100 కిలోల చెత్తను బయోగ్యాస్‌ గా మార్చే సామర్థ్యముంటుంది. అపార్టుమెంట్లు - మార్కెట్‌ యార్డులు - పశువధశాలలు - రెస్టారెంట్లు - సూపర్‌ మార్కెట్లు తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
కొచ్చితోపాటు బెంగళూరు - గుజరాత్‌ - నాగ్‌ పూర్‌ తదితర నగరాల్లో దీని వినియోగంపై ప‌రిశీల‌న జ‌రుగుతోంది.

ఒక్క హైదరాబాద్‌ లోనే రోజుకు సుమారు 4 వేల టన్నుల చెత్త పోగ‌వుతుంది. దీన్నిజ‌వ‌హ‌ర్‌ న‌గ‌ర్‌ డంపింగ్‌ యార్డుకు తరలించడానికి ఏటా రూ.200 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఆ యార్డు నిండిపోతే, మరో ప్రాంతాన్ని వెతికి చెత్తతో నింపాల్సిందే.

జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తను శుద్ధిచేసే విధానం ప్రస్తుతం అందుబాటులో లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వీటిని ఏర్పాటుచేస్తే సాంకేతిక‌త‌ను అందించ‌డానికి సిద్ధ‌మ‌ని ఐఐసీటీ ప్ర‌క‌టించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/