Begin typing your search above and press return to search.

పాపం మిచెల్.. జైలులో కోతిని చేశారట!

By:  Tupaki Desk   |   10 May 2019 7:03 AM GMT
పాపం మిచెల్.. జైలులో కోతిని చేశారట!
X
క్రిస్టియన్ మిచెల్ గుర్తున్నాడా? అగస్టా వెస్ట్‌ ల్యాండ్ చాపర్ కుంభకోణం కేసులో మధ్యవర్తిత్వం వహించి ప్రస్తుతం తీహార్ జైలులో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. జైలు అధికారులు అతడిని కోతిలా చూస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ బావురుమన్నాడు. జైలు అధికారులు తనను జూలోని కోతిలా చూస్తున్నారంటూ ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఆహారం కూడా సరిగ్గా పెట్టడం లేదని - ఉడకబెట్టిన ఆహారం పడేస్తున్నారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. జైలు అధికారుల తీరుతో తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గిపోయానని బావురుమన్నాడు. తాను యూరోపియన్ బ్రేక్‌ ఫాస్ట్ అడిగినప్పటి నుంచి జైలు అధికారుల తీరులో మార్పు వచ్చిందని - అడిగింది ఇవ్వకపోగా మర్కటంలా చూస్తున్నారని చెప్పుకొచ్చాడు.

జైలు అధికారులపై మిచెల్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి అరవింద్ కుమార్ జైలు అధికారులపై సీరియస్ అయ్యారు. మిచెల్‌ ను అలా చూడడం తప్పని - ఖైదీల హక్కులను ఎలా హరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులు శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని ఆర్డరేశారు. అయితే, కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ వేడుకలు జరుపుకునేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలంటూ మిచెల్ పెట్టుకున్న దరఖాస్తును మాత్రం జడ్జి కొట్టివేశారు.