Begin typing your search above and press return to search.

విచారణ పూర్తి: కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి - అస్మిత్ రెడ్డి

By:  Tupaki Desk   |   23 Jun 2020 6:15 AM GMT
విచారణ పూర్తి: కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి - అస్మిత్ రెడ్డి
X
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి విచారణ పూర్తయింది. విచారణ పూర్తవడంతో వారిని కడప జైలుకు తరలించారు.

బీఎస్‌ 3 అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్‌లపై వారిద్దరి పాత్ర ఉందని రుజువవడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని రెండ్రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. విచారణ పలు కోణాల్లో చేశారు. సోమవారం ఉదయం 9 గంటల వరకు వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి వారిద్దరిని విచారించారు. విచారణ అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పూర్తి కావడంతో వారిద్దరినీ తిరిగి కడప జైలుకు తరలించారు.

తండ్రీకొడుకులను కీలక విషయాలను అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. బీఎస్-3 వాహనాలను ఎలా బీఎస్-4 గా మార్చి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారో ఆరా తీసినట్లు సమాచారం. ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు? నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎలా తయారు చేసి చలామణి చేశారన్న దానిపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తవడంతో తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.