Begin typing your search above and press return to search.

దున్నపోతు కోసం రెండు ఊళ్ల మధ్య ఎంత రచ్చంటే?

By:  Tupaki Desk   |   21 Oct 2019 5:45 AM GMT
దున్నపోతు కోసం రెండు ఊళ్ల మధ్య ఎంత రచ్చంటే?
X
ఒక దున్నపోతు కోసం రెండు ఊళ్ల వారు పోటాపోటీగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడా రెండు గ్రామాల మధ్య కొత్త ఉద్రిక్తతకు వేదికగా మారింది. సదరు దున్నపోతు తమదంటే తమదన్న చర్చ అంతకంతకూ పెరిగి పెద్దది కావటమే కాదు.. చివరకు పోలీస్ స్టేషన్లు.. డీఎన్ఏ పరీక్షలు.. మఠాధిపతుల పంచాయితీ వరకూ వెళ్లటం గమనార్హం.

ఇంత జరిగిన తర్వాత కూడా సదరు దున్నపోతు ఎవరిదన్న విషయం మీద క్లారిటీకి రాకపోవటం ఈ ఉదంతంలో పెద్ద ట్విస్ట్ గా చెప్పాలి. ఇంతకీ రెండు గ్రామాల మధ్య దున్నపోతు లొల్లి ఎందుకు షురూ అయ్యింది? అన్న విషయంలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా హారనహల్లి-హోన్నాళి బేలిమల్లూరు గ్రామాల వారు గ్రామదేవతకు గ్రామంలో వదిలిన దున్నపోతును తమదంటే తమదంటూ పోటీ పడటంతో పంచాయితీ మొదలైంది.

గ్రామాల్లో గ్రామదేవతకు సమర్పించే దున్నపోతును ఊరి మీదకు వదిలేస్తారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏదైనా వేడుకల వేళ బలి ఇస్తారు. ఇదే ఇక్కడ సమస్యగా మారింది. రెండు ఊళ్ల వారు దున్నపోతు తమదంటే తమదని వాదులాడుకుంటున్నారు. ఒకదశలో దున్నపోతును ఈనిని తల్లి రక్తాన్ని సేకరించి.. రెండింటి డీఎన్ఏను టెస్ట్ చేస్తే ఎవరిదన్నది తేలిపోతుందన్న ఆలోచన తెర మీదకు వచ్చింది.

కాకుంటే.. అమ్మవారికి సమర్పించే దున్నపోతు నుంచి డీఎన్ ఏ పరీక్ష కోసం రక్తం సేకరిస్తే దేవత ఆగ్రహానికి గురి అవుతుందన్న మాటతో వెనక్కి తగ్గారు. దీనికి బదులుగా హోన్నాళికి చెందిన హిరేకల్మఠం చన్న మల్లికార్జున స్వామీజీ ముందు ప్రమాణం చేయించాలనుకుంటే.. రెండు ఊళ్ల వారు ఒకే రీతిలో ప్రమాణం చేయటంతో.. తీర్పు చెప్పే స్థానంలో ఉన్న మఠాధిపతుల నోటి నుంచి మాట రాలేని పరిస్థితి. దీంతో.. ఏ ఊరికి దున్నపోతును ఇవ్వాలన్నది అర్థం కాక.. తీర్పు వాయిదా వేశారు.