Begin typing your search above and press return to search.

బెంగాల్‌ లో క‌ల‌క‌లం!... అధికార పార్టీ ఎమ్మెల్యే హ‌త్య‌!

By:  Tupaki Desk   |   10 Feb 2019 4:03 AM GMT
బెంగాల్‌ లో క‌ల‌క‌లం!... అధికార పార్టీ ఎమ్మెల్యే హ‌త్య‌!
X
అటు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఇటు రాష్ట్రంలోన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని స్టేట్ గ‌వర్న‌మెంట్‌... బాహాబాహీ పోరు.. వెర‌సి ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. మొన్న‌టికి మొన్న బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు వ‌చ్చిన సీబీఐ అధికారుల‌కు బెంగాల్ పోలీసులు చుక్క‌లు చూపితే... అది చాల‌ద‌న్న‌ట్లుగా దీదీ ఏకంగా న‌డిరోడ్డు ఎక్కి మోదీ స‌ర్కారుపై దండెత్తారు. రెండు రోజుల పాటు రోడ్దుపైనే దీక్ష చేసిన దీదీ... సుప్రీంకోర్టు మొట్టికాయ‌ల‌తో ఎట్టకేల‌కు దీక్ష విర‌మించారు. అక్క‌డితో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణుగుతుందిలే అనుకున్నా... కోర్టు ఆదేశాల మేర‌కు రాజీవ్ సీబీఐ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సీబీఐ విచార‌ణ‌కు వెళ్లిన రాజీవ్ అరెస్ట్ కాకున్నా... దీదీ స‌ర్కారుకు పెద్ద దెబ్బేన‌న్న వార్త‌లు వినిపించాయి. రాష్ట్రంతో పాటు దేశం మొత్తం దీని గురించి చ‌ర్చించుకుంటున్న స‌మ‌యంలో బెంగాల్ లో మ‌రో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుంది.

అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌ కు చెందిన ఎమ్మెల్యే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఓ పూజా కార్య‌క్ర‌మానికి మంత్రితో క‌లిసి హాజ‌రైన ఎమ్మెల్యేను దుండ‌గులు పాయింట్ బ్లాంక్ రేంజిలోనే కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు బెంగాల్ లో దావాన‌లంలా వ్యాపించింది. ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే చంపేయ‌డ‌మంటే మాటలు కాదు క‌దా. అది కూడా రాష్ట్ర మంత్రి పాల్గొన్న కార్య‌క్ర‌మంలో మంత్రి ప‌క్క‌నే నిల‌బ‌డ్డ ఎమ్మెల్యేను దుండ‌గులు కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌రోమారు బెంగాల్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. దీదీని షాక్‌ కు గురి చేసిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... బెంగాల్ లోని న‌దియా జిల్లా కృష్ణ‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తృణ‌మూల్ నేత స‌త్య‌జిత్ బిశ్వాస్ ను దుండ‌గులు కాల్చి చంపారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని పుల్బ‌రీలో ఓ పూజా కార్య‌క్ర‌మానికి బిశ్వాస్ హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి బెంగాల్ మంత్రి ర‌త్న ఘోష్ కూడా హాజ‌ర‌య్యారు. పూజాదికాల్లో పాలుపంచుకుంటున్న స‌మ‌యంలో మంత్రి ప‌క్క‌నే నిల‌బ‌డ్డ బిశ్వాస్‌ ను అతి స‌మీపం నుంచి తుపాకీతో కాల్చిన దుండ‌గులు అక్క‌డి నుంచి క‌న్నుమూసి తెరిచే లోగానే పారిపోయారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో జరిగిన కాల్పుల్లో బిశ్వాస్ అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశారు. రెప్ప‌పాటులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో మంత్రి ఘోష్ షాక్ తిన్నారు. మంత్రి, ఎమ్మెల్యే గ‌న్‌ మెన్ తేరుకునేలోగానే దుండ‌గులు అక్క‌డి నుంచి చాక‌చ‌క్యంగా పారిపోయారు. దుండ‌గులు పారిపోయిన త‌ర్వాత గానీ తేరుకోలేక‌పోయిన పోలీసులు... కాల్పుల‌కు వినియోగించిన రివాల్వ‌ర్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు బెంగాల్ లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారింది.