Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ లేడీ బీజేపీలో చేరారు

By:  Tupaki Desk   |   1 Jan 2018 7:04 AM GMT
ట్రిపుల్ త‌లాక్ లేడీ బీజేపీలో చేరారు
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. మైనార్టీ ఓటు బ్యాంక్‌ ను రెండు ముక్క‌లు చేసిన ఘ‌న‌త ట్రిపుల్ త‌లాక్ దేన‌ని చెప్పాలి. సెక్యుల‌ర్ పేరు చెప్పి మైనార్టీ ఓటుబ్యాంక్‌ ను ఏకీకృతం చేసిన దానికి బ‌దులు అన్న‌ట్లుగా ట్రిపుల్ త‌లాక్ పేరుతో మైనార్టీ ఓటు బ్యాంకును రెండుగా డివైడ్ చేయ‌టంలో మోడీ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. అంతేనా.. ముస్లిం మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌కుడిగా మారారు మోడీ.

దీనికి నిద‌ర్శ‌నంగా తాజాగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ట్రిపుల్ త‌లాక్ ఉదంతాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టంలో కీల‌క భూమిక పోషించిన ఇష్ర‌త్ జ‌హాన్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పశ్చిమ‌బెంగాల్ లోని హౌరాలో బీజేపీ కార్యాల‌యానికి వెళ్లిన ఆమె.. బీజేపీలో చేరారు. ఆమెను పార్టీలోకి బీజేపీ బెంగాల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సాయంత‌న్ బ‌సు ఆహ్వానించారు.

ట్రిపుల్ త‌లాక్‌ కు వ్య‌తిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిష‌న‌ర్ల‌లో ఇష్ర‌త్ ఒక‌రు. దుబాయ్ నుంచి ఆమె భ‌ర్త ఫోన్లో మూడు సార్లు త‌లాక్ చెప్ప‌టం ద్వారా విడాకులు ఇచ్చారు. దీనికి వ్య‌తిరేకంగా ఆమె న్యాయ‌పోరాటం చేయ‌టం.. దీనికి మోడీ మ‌ద్ద‌తు ల‌భించ‌టంతో ఒక సాదాసీదా మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయం దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. చివ‌ర‌కు భారీ ఎత్తున రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర తీసింద‌ని చెప్పాలి.

ఇష్ర‌త్ లాంటి బాధితులకు జ‌రుగుతున్న అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడిన బీజేపీ ఇప్పుడు బిల్లును తెచ్చి లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంది. బీజేపీతో పాటు మ‌రికొన్ని ఇత‌ర పార్టీలు మిన‌హాయించి ఎక్కువ పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ మీద ఉన్న లెక్క‌ల‌తో ట్రిపుల్ త‌లాక్ బిల్లును వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు మైనార్టీ మ‌హిళ‌లు మోడీ త‌మ ర‌క్ష‌కుడిగా అభివ‌ర్ణిస్తున్నారు. మైనార్టీల‌లో చీలిక తీసుకురావ‌టంతో స‌క్సెస్ అయిన మోడీ అండ్ కో.. తాజాగా మైనార్టీ మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడిన వారిని పార్టీలో చేర్చ‌టం ద్వారా మ‌రో రాజ‌కీయ వ్యూహానికి తెర తీసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే తాను బీజేపీలో చేర‌టంపై ఇష్ర‌త్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు. కాషాయ కండువాను వేసుకోవ‌టంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.