Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ పిటిష‌న‌ర్ కు అలా వార్నింగ్ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   19 July 2019 4:35 AM GMT
ట్రిపుల్ త‌లాక్ పిటిష‌న‌ర్ కు అలా వార్నింగ్ ఇచ్చారు!
X
ఇష్ర‌త్ జ‌మాన్ అన్న పేరును ప్ర‌స్తావించిన వెంట‌నే ఎక్క‌డో విన్న‌ట్లుగా అనిపించొచ్చు. అదే.. ట్రిపుల్ త‌లాక్ పిటిష‌న‌ర్ అన్నంత‌నే ఆమె గుర్తుకు వ‌చ్చేస్తారు. ఒక కొడుకు.. ప‌ద్నాలుగేళ్ల కుమార్తెతో కోల్ క‌తా న‌గ‌రంలో ఒంట‌రిగా బ‌తికే ఆమెకు దుబాయ్ లో ఉన్న ఆమె భ‌ర్త ఫోన్లో ట్రిపుల్ త‌లాక్ చెప్పేసి విడాకులు ఇచ్చేశారు. అప్ప‌టి నుంచి ఆమె ట్రిపుల్ త‌లాక్ మీద పోరాడుతున్నారు. ట్రిపుల్ త‌లాక్ కు వ్య‌తిరేకంగా సుప్రీంలో న్యాయం కోసం పోరాడుతున్న ఐదుగురిలో ఇష్ర‌త్ జ‌మాన్ ఒక‌రు.

తాజాగా ఆమె అనూహ్య‌రీతిలో బెదిరింపులు ఎదుర‌య్యాయి. కోల్ క‌తాలోని త‌న నివాసానికి ద‌గ్గ‌ర్లో ఏర్పాటు చేసిన హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి ఆమె హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె హిజాబ్ ధ‌రించి వెళ్లారు. దీనిపై కొంద‌రు ముస్లింలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఆమె ఇంటికి వెళుతున్న వేళ‌.. అడ్డుకొని బెదిరింపుల‌కు దిగారు. చంపేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్లుగా పోలీసుల‌కు ఇచ్చిన తాజా కంప్లైంట్ లో పేర్కొన్నారు.

నువ్వు చేసిన ప‌ని వ‌ల్ల ముస్లిం స‌మాజం అవ‌మానానికి గురి అవుతోంది. ప్రాణాల‌తో వ‌దిలేస్తున్నాం.. ఇప్ప‌టికైనా తీరు మార్చుకోవాలంటూ బెదిరింపుల‌కు గురి చేసిన‌ట్లుగా ఆమె చెప్పారు. త‌న‌పై బెదిరింపుల‌కు దిగుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల్ని కోరుతున్నారు. త‌న బావ‌.. త‌న ఇంటి య‌జ‌మాని త‌న‌ను అస‌భ్యంగా తిట్టేస్తున్న‌ట్లుగా ఆమె ఆరోపించారు.

ఇంటిని ఖాళీ చేయాల‌ని కోరుతున్నార‌ని.. త‌న‌కు ఏ క్ష‌ణంలో అయినా హాని త‌ల‌పెట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. సామూహిక హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నానికి వెళ్లి వ‌స్తున్న వారిని హెచ్చ‌రిస్తున్న వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని.. ఎవ‌రి వ్య‌క్తిగ‌త ఇష్టం ప్ర‌కారం వారు వ్య‌వ‌హ‌రించొచ్చ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.