Begin typing your search above and press return to search.

సీఎం ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి ... ఇంటర్నెట్ నిలిపివేత‌ !

By:  Tupaki Desk   |   16 Aug 2021 7:00 AM GMT
సీఎం ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి ... ఇంటర్నెట్ నిలిపివేత‌ !
X
త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్‌ పై గత వారం హ‌త్యాయ‌త్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. అయితే , ఈ సంఘటన గురించి పూర్తిగా మరిచిపోకముందే, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడి జరిగింది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులతో ఆదివారం రాత్రి దాడి చేశారు. షిల్లాంగ్ నగరంలోని లైమర్ ప్రాంతంలో 3వ మైలు వద్ద ఉన్న సీఎం సంగ్మా వ్యక్తిగత నివాసంపై రెండు పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

మొదటి పెట్రోల్ బాంబు సీఎం ఇంటి ఎదుట ఆవరణలో పడగా, రెండో బాంబు ఇంటి వెనుక పెరడులో పడినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిబ్బంది బాంబు పడి చెలరేగిన మంటలను ఆర్పివేశారు. అయితే, ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. ఈ దాడి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు వెల్లడించారు. మేఘాల‌య రాజ‌ధాని షిల్లాంగ్‌ లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. నేష‌న‌ల్ లిబ‌రేష‌న‌ల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌ కౌంట‌ర్‌ తో ఒక్క‌సారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళ‌న కారులు రోడ్ల‌పైకి వ‌చ్చి వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. ఇటీవ‌లే లైతుంఖ్రా వ‌ద్ద జ‌రిగిన బాంబు దాడుల్లో థాంగ్‌ కీ హ‌స్తం ఉంద‌నే అనుమానాలు క‌ల‌గ‌డంతో ఆయ‌న్న ప్ర‌శ్నించేందుకు పోలీసులు, అధికారులు ఆయ‌న ఇండికి వెళ్లారు. అయితే, థాంగ్‌ కీ పోలీసుల‌పై క‌త్తితో దాడి చేయ‌డంతో పోలీసులు ఎన్‌ కౌంట‌ర్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున హింస దృష్ట్యా మేఘాలయ ప్రభుత్వం షిల్లాంగ్ అగ్లోమరేషన్‌ లో కర్ఫ్యూ విధించింది. ఆదివారం నాలుగు జిల్లాల్లో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సంగ్మా ఇంటిపై బాంబు దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ దాడికి సంబంధించిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షిల్లాంగ్‌ లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ హోంశాఖ మంత్రి ల‌క్మెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.