Begin typing your search above and press return to search.

ఈశాన్యం తీర్పు ఇదే..!

By:  Tupaki Desk   |   3 March 2018 7:00 AM GMT
ఈశాన్యం తీర్పు ఇదే..!
X
దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే అవ‌కాశం లేన‌ప్ప‌టికీ మోడీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న వేళ జ‌రిగి ఈశాన్య రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ఒకింత ఆస‌క్తి నెల‌కొంది. మామూలుగా అయితే.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ఎవ‌రికి అంత‌గా ఆస‌క్తి ఉండ‌దు. ఎందుకంటే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే తుది ఫ‌లితాలు ఉండ‌టం అక్క‌డ మామూలే. అయితే.. మోడీ అధికారంలోకి వ‌చ్చాక‌.. బీజేపీకి ఎంత‌కూ అంతుబ‌ట్ట‌ని ఈశాన్యం మీద ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌టం.. కాషాయ‌జెండా ఎగుర‌వేయాల‌న్న కాంక్ష ఎక్కువ‌గా ఉండ‌టంతో.. మోడీ వ్యూహాలు ఎంత‌మేర వ‌ర్క్ వుట్ అయ్యాయ‌న్న కుతూహ‌లం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైంది.

ఈ రోజు ఉదయం నుంచి మూడు ఈశాన్య‌రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ మొద‌లైంది. త్రిపుర‌.. నాగాలాండ్‌.. మేఘాల‌య‌ల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్ ఫ‌లితాల‌కు త‌గ్గ‌ట్లే వ‌చ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త్రిపుర‌లో వామ‌ప‌క్షాల‌కు ఈసారి దెబ్బ త‌గ‌లటం ఖాయ‌మ‌ని.. బీజేపీకి ఈసారి అధికారం చేతికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. దాదాపుగా పాతికేళ్ల‌కు పైనే త్రిపుర‌లో అధికారంలో ఉన్న వామ‌ప‌క్షాల‌కు.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఇప్పుడా పార్టీ ప్ర‌తిప‌క్ష బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించ‌నుంది. ఓట్ల లెక్కింపు మొద‌లైన వేళ వామ‌ప‌క్షాల‌కు.. బీజేపీ న‌డుమ హోరాహోరీ పోరు సాగుతున్నా.. బీజేపీ అధిక్య‌త దిశ‌గా దూసుకెళుతోంది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాలు చూస్తే.. త్రిపుర‌లో బీజేపీ స్ప‌ష్ట‌మైన మెజార్టీని సొంతం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 40 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉండ‌గా.. వామ‌ప‌క్షాలు 18 స్థానాల్లో మాత్ర‌మే అధిక్య‌త‌లో ఉన్నాయి. ఒక స్థానంలో ఇత‌రులు అధిక్య‌త‌లో ఉన్నారు. మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల వేళ‌కు ఏ ఒక్క ఎమ్మెల్యే విజ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

నాగాలాండ్‌ లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్‌)కు.. బీజేపీ కూట‌మి అయిన ఎన్డీపీపీల‌కు మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. అధికార‌.. విప‌క్ష ఫ్రంట్ ల మ‌ధ్య‌న అధిక్య‌త తొలుత దోబూచులాడ‌గా.. ఇప్పుడిప్పుడు అధిక్య‌త మీద స్ప‌ష్ట‌త వ‌స్తోంది. మొత్తం 60 స్థానాలు ఉన్న నాగాలాండ్ లో 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అధికార ఎన్పీఎఫ్ కు 24 స్థానాల్లో అధిక్య‌త‌లో సాగుతుంటే.. బీజేపీ కూట‌మి ఎన్డీపీపీకు 30 స్థానాల్లో అధిక్య‌త‌లో కొన‌సాగుతోంది. దీంతో.. నాగాలాండ్ లో బీజేపీ కూట‌మి అధికారం చేప‌ట్ట‌టం ఖాయంగా మారింది.

ఇక‌.. మేఘాల‌య‌లో మాత్రం ప‌రిస్థితి హంగ్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇక్క‌డ అధికార కాంగ్రెస్ 22 స్థానాల్లో అధిక్య‌త‌లో కొన‌సాగుతుండ‌గా.. బీజేపీ కేవ‌లం 8 స్థానాల్లో మాత్ర‌మే అధిక్య‌త‌లో ఉంది. ఎన్ పీపీ 10 స్థానాల్లో.. ఇత‌రులు 12 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉన్నారు. మొత్తం 60 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అత్య‌ధిక స్థానాల్లో కాంగ్రెస్ అధిక్య‌త ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన సీట్లు మాత్రం ఆ పార్టీకి ద‌క్క‌ని ప‌రిస్థితి. దీంతో.. ఈ రాష్ట్రంలో హంగ్ ప‌రిస్థితి నెల‌కొంది.