Begin typing your search above and press return to search.

జూనియర్ పై ట్రోలింగ్

By:  Tupaki Desk   |   23 Nov 2021 12:30 AM GMT
జూనియర్ పై ట్రోలింగ్
X
తమ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం వస్తే చాలు టీడీపీ+టీడీపీ మద్దతుదారులు ఏ విధంగా రెచ్చిపోతారనేందుకు ఇదే తాజా ఉదాహరణ. మొన్నటి శుక్రవారం అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరితో పాటు కుటుంబంపై నీచంగా మాట్లాడారంటు చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో భోరు భోరున ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఆరోపించారు కాబట్టి పార్టీ నేతలు ఎలాగూ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక చంద్రబాబు కోసమని నందమూరి కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖుల్లో కొందరు, ఇతర పార్టీల నేతలు కూడా రెచ్చిపోయారు.

ఇదే ఘటనపై ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించినా కాస్త వైవిధ్యంగా ఉంది. ఘటనపై స్పందించిన జూనియర్ పర్టిక్యలర్ గా తన మేనత్త భువనేశ్వరి పేరును కానీ చంద్రబాబు ఏడుపును కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేయలేదు. మామూలుగా ఆడవాళ్ళను టార్గెట్ చేయడం మంచిది కాదని మాత్రమే చెప్పారు. పైగా వ్యక్తిగత దూషణలకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదని స్పష్టంగా చెప్పారు.

దీన్నే టీడీపీ నేతలు, మద్దతుదారులు చివరకు చంద్రబాబుకు మద్దతిచ్చే కొందరు జర్నలిస్టులు కూడా తట్టుకోలేకపోయారు. పై వర్గాల ఉద్దేశ్యంలో జగన్ తో పాటు వైసీపీని జూనియర్ దుమ్మెత్తిపోయాలని కాబోలు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ప్రకటించాలని అనుకున్నారేమో. కానీ జూనియర్ స్పందనలో అలాంటివేమీ కనబడకపోవటంతో జూనియర్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. జూనియర్ స్పందనను ఎగతాళి చేస్తున్నారు. జూనియర్ స్పందన ఒక మేధావిగా ఉందని, జూనియర్ చెప్పిన సుభాషితాలు చాలా బాగున్నాయంటు ఎద్దేవా చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మంత్రి కొడాలి, జూనియర్ అత్యంత సన్నిహితులు. చంద్రబాబు ఆరోపణలపై స్పందించే ముందు బహుశా జూనియర్ మంత్రితో మాట్లాడి ఏమి జరిగిందనే విషయాన్ని కనుక్కున్నారేమో. మంత్రి ఏమి చెప్పారో అసలు చెప్పారో లేదో కూడా తెలీదు కానీ జూనియర్ మాత్రం చాలామంది రెచ్చిపోయినట్లు రెచ్చిపోలేదు. చంద్రబాబు కోసమని జగన్ కు వార్నింగులు ఇవ్వలేదు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని తన అబిమానులకు కూడా పిలుపివ్వలేదు. తమ ఆలోచనలకు భిన్నంగా ఉండటంతో జూనియర్ పై విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు.