Begin typing your search above and press return to search.

ప్రయారిటీ మరచిపోయిన కమలదళం

By:  Tupaki Desk   |   27 July 2021 4:57 AM GMT
ప్రయారిటీ మరచిపోయిన కమలదళం
X
ప్రజలకు కావాల్సిందేమిటి ? తాము చేస్తున్న డిమాండ్లు ఏమిటి ? అనే విషయంలో కమలనాదులు ప్రయారిటీలను మరచిపోయినట్లున్నారు. జనాలకు ఏమి కావాలనే విషయాలను పూర్తిగా పక్కనపెట్టేసి తాము మాత్రం తమ పార్టీ లైనులోనే ముందుకెళదామని ఫిక్సయినట్లున్నారు. అందుకనే బీజేపీ నేతలు ప్రజాధరణను కోల్పోతున్నారు. తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆధ్వర్యంలో మొదలైన టెంపుల్ టూర్ విషయంలో పార్టీలోనే గందరగోళంగా మారింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీర్రాజు ఓ విచిత్రమైన లైన్ తీసుకున్నారు. అదేమిటంటే కూల్చేసిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలట. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు దేవాలయాలను తన బృందంతో సందర్శించిన అధ్యక్షుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా గోల చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాలను కూల్చేస్తున్నారని, మత మార్పిడులు చేస్తున్నారంటు సోము నానా గోల చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్క దేవాలయాన్ని కూల్చలేదు. ఇక మతమార్పిడులంటారా అందరు ఆరోపణలు చేసేవారే కానీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుని ఎవరినైనా మత మార్పిడులు చేసిందని ఆధారాలతో చూపించిన వారే లేరు. జగన్ మీద అక్కసుతో నోటికొచ్చిన ఆరోపణలు చేయించటమే కానీ తమ ఆరోపణలకు ఆధారాలను చూపాలని ఎవరు అనుకోవటంలేదు.

నిజానికి జనాలకు ఇపుడు దేవాలయాలకన్నా ఆసుపత్రులు, ఉద్యోగ, ఉపాధి చాలా అవసరం. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి చూపించాలని డిమాండ్ చేయాల్సిన బీజేపీ దేవాలయాలను అజెండాగా తీసుకోవటమే విచిత్రంగా ఉంది. గతంలో అంతర్వేది దేవాలయం రథం తగలబడిపోయినపుడు హిందు-క్రిస్తియన్ అనే వాదాన్ని బీజేపీ+జనసేన నేతలు తీసుకొచ్చారు. అయితే వాళ్ళ ఆరోపణలను జనాలెవరు పట్టించుకోలేదు.

ఇంతకాలానికి మళ్ళీ జనాలకు పట్టని ఓ అంశాన్ని పట్టుకుని పలుచనైపోతున్నారు. దాదాపు 35 దేవాలయాలను కూల్చేసింది చంద్రబాబునాయుడు హయాంలోనే. దేవాలయాలు కూలిపోయినపుడు ఇదే బీజేపీ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండేది. బీజేపీ తరపున ఇద్దరు మంత్రులుండేవారు. దేవాలయాలు కూలిపోయినపుడు మంత్రులు కానీ బీజేపీ నేతలు కానీ ఎవ్వరూ మాట్లాడకపోవటం ఆశ్చర్యం. వీర్రాజు వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి ఏమీలేక ఏదో ఓ అంశాన్ని పట్టుకోవాలని చివరకు దేవాలయాలను టేకప్ చేసినట్లుంది.