Begin typing your search above and press return to search.

ఉమెన్స్ క్రికెటర్లు ఏం తక్కువ..బీసీసీఐ తీరుపై ట్రోల్స్

By:  Tupaki Desk   |   18 May 2021 2:05 PM IST
ఉమెన్స్ క్రికెటర్లు ఏం తక్కువ..బీసీసీఐ తీరుపై ట్రోల్స్
X
మన దేశంలో అనాదిగా మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. అయితే మారిన కాలం బట్టి ఈ తీరులో కూడా మార్పు వస్తోంది. కానీ అప్పుడప్పుడు మహిళలపై వివక్ష కనబడుతూ ఉంటుంది. దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి. క్రికెటర్లను ఎంతగానో ఆరాధిస్తుంటారు. అయితే మన దేశంలో మెన్స్ తో పాటు ఉమెన్స్ జట్టు కూడా ఉంది. అయితే మేల్ క్రికెటర్లకు ఉన్నంత ఆదరణ ఉమెన్స్ కు లేదు. మేల్స్ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా పొగడ్తల జల్లు కురుస్తుంది. అదే ఉమెన్స్ జట్టు పెద్ద పెద్ద టోర్నీలు గెలిచినా వారికి ప్రోత్సాహం ఉండదు.

బీసీసీఐ కూడా మెన్స్ టీంకి వార్షిక వేతనం భారీగా ఇస్తోంది. హై రేంజ్ వసతులు కల్పిస్తోంది. అదే ఉమెన్స్ జట్టు విషయానికొస్తే ఇవేవీ పెద్దగా కనిపించవు. తాజాగా మరోసారి బీసీసీఐ ఉమెన్స్ టీం పట్ల వివక్ష చూపడంపై విమర్శలు వస్తున్నాయి. జూన్ లో పురుషుల జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ పోటీ తోపాటు, ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ ల సీరిస్ లో తలపడనుంది. ఇందుకోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

ఉమెన్స్ టీం కూడా అదే సమయంలో ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల టీమ్ తో తలపడనుంది. కాగా కరోనా నేపథ్యంలో ఇంగ్లాండ్ లో పర్యటించే పురుష, మహిళా జట్ల ఆటగాళ్లు అందరినీ ముంబైలోని ఒక హోటల్ లో ముందే క్వారంటైన్ చేయనున్నారు. అయితే హోటల్ లో ప్రవేశించే 48 గంటల ముందు ఆటగాళ్లు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి హోటల్లో ప్రవేశం ఉంటుంది.

కాగా పురుష ఆటగాళ్లకు క్వారంటైన్ విషయంలో ఒక వారం మాఫీ చేశారు. బీసీసీఐ పురుష క్రికెటర్లకు ఇళ్ల వద్దే కరోనా పరీక్షలు చేస్తోంది. రోజు గ్యాప్ ఇచ్చి టెస్ట్ మూడు సార్లు టెస్టులు నిర్వహిస్తున్నారు. వారి బంధువులకు కూడా టెస్ట్ లు చేస్తున్నారు. అయితే మహిళ క్రికెటర్ల విషయానికి వచ్చేసరికి కరోనా నిబంధనలు మారిపోయాయి. ఉమెన్స్ క్రికెటర్లు జస్ట్ తమకు కరోనా లేదంటూ ఒక సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు హోటల్ లోని బయో బబుల్ లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.

మహిళా ప్లేయర్లకు బీసీసీఐ కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు. ఆటగాళ్ళే సొంతంగా ఆస్పత్రులు, పరీక్ష కేంద్రాలలో టెస్ట్ లు చేయించుకోవాలి. ఇలా ఆస్పత్రులు, టెస్టింగ్ సెంటర్లకు మహిళ క్రీడాకారులు వెళ్లడం వల్ల పక్కనున్న వారి నుంచి వైరస్ సోకే అవకాశం ఉంటుందని, మహిళా క్రికెటర్ల పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పురుష, మహిళ క్రికెటర్లు ఓకే దేశ పర్యటనకు వెళుతున్నా, ఒకే విమానంలో బయలుదేరుతున్నా ఇలా వివక్ష చూపడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.