Begin typing your search above and press return to search.

నెటిజ‌న్ల‌కు టార్గెట్ గా రేసు గుర్రం విల‌న్

By:  Tupaki Desk   |   23 July 2022 5:03 AM GMT
నెటిజ‌న్ల‌కు టార్గెట్ గా రేసు గుర్రం విల‌న్
X
బ‌హుభాషా న‌టుడు ర‌వికిష‌న్ హీరోగా, విల‌న్ గానూ వివిధ భాషా చిత్రాల్లో న‌టించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ రేసు గుర్రంలో విల‌న్ శివారెడ్డిగా ర‌వికిష‌న్ అద్భుతంగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ర‌వికిష‌న్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ గోర‌ఖ్ పూర్ నుంచి గ‌తంలో ప్ర‌స్తుత యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ వ‌రుస‌గా ఐదుసార్లు గెలుపొందారు. ఆయ‌న సీఎంగా వెళ్ల‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌వికిష‌న్ బీజేపీ త‌ర‌ఫున గెలుపొందారు.

కాగా ర‌వికిష‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌ను నెటిజ‌న్లు ల‌క్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ప్ర‌స్తుతం పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్రైవేటు బిల్లు పెడ‌తామ‌ని మీడియాతో మాట్లాడుతూ ర‌వికిష‌న్ చెప్పారు. జ‌నాభాను నియంత్రించిన‌ప్పుడే భార‌త్ విశ్వ గురు అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. జ‌నాభాను అదుపులోకి తీసుకురావ‌డం ముఖ్య‌మని.. వ‌చ్చే ఏడాది భార‌త్.. చైనాను అధిగ‌మించి జ‌నాభాలో ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తుంద‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో జనాభాను అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యమ‌ని ర‌వికిష‌న్ తెలిపారు. ఈ ప్రైవేట్ బిల్లు దేశాభివృద్ధి కోణంలోనే తాను ప్ర‌వేశ‌పెట్టాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు. ఇది ఏ కులాన్నో, మ‌తాన్నో ల‌క్ష్యంగా చేసుకుని పెడుతుంద‌ని కాద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ర‌వికిష‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుని నెటిజ‌న్లు ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయ‌న‌కు న‌లుగురు పిల్ల‌లు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. ర‌వికిష‌న్ కు మొత్తం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దీంతో ఆయ‌న నెటిజ‌న్ల‌కు ల‌క్ష్యంగా మారారు.

దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ సంగతి త‌ర్వాత... ముందు మీ ఇంట్లో జ‌నాభాను నియంత్రించండి అంటూ నెటిజ‌న్లు ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. నలుగురు పిల్లల తండ్రి జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నారంటూ నెటిజ‌న్లు ఆయ‌న‌ను ట్రోల్ చేశారు. ఈ బిల్లు పార్ల‌మెంటులో ఆమోదం పొందితే రవికిష‌న్ త‌న న‌లుగురు పిల్ల‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే ఎంచుకోవాల్సి ఉంటుంద‌ని మ‌రికొంత‌మంది నెటిజ‌న్లు ఆయ‌న‌ను ఎద్దేవా చేశారు. దంప‌తులు ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి క‌న‌కూడ‌ద‌నుకుంటే ర‌వికిష‌న్ త‌న న‌లుగురు పిల్ల‌ల్లో ఏ ఇద్ద‌రిని ఎంచుకుంటారు అని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు.

కాగా గ‌తంలోనూ జ‌నాబా నియంత్ర‌ణ బిల్లును తీసుకురావ‌డానికి బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేదు. మ‌రోవైపు జనాభా నియంత్రణ కోసం ప్ర‌భుత్వ ప‌రంగా తాము ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధాన‌మిస్తూ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమాచారాన్ని అందించారు.