Begin typing your search above and press return to search.

నాగబాబు సవాళ్ళు... జనసేనకు ట్రబుల్స్!

By:  Tupaki Desk   |   25 Aug 2022 12:30 AM GMT
నాగబాబు సవాళ్ళు... జనసేనకు ట్రబుల్స్!
X
అన్నయ్య మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్. మధ్యలో నాగబాబు ఏంటి అంటే ఆయన కూడా స్టారే. ఆయన కూడా ప్రముఖుడే. అయితే నాగబాబు నాడు అన్నయ్య ప్రజరాజ్యంలో కీలకంగా ఉన్నారు. నేడు తమ్ముడు పార్టీ జనసేనలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే తమకు ఇచ్చిన బాధ్యతలను చక్కగా పెద్ద మనిషి తరహాలో నెరవేరిస్తేనే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది. సమయం సందర్భం కానీ మాటలు, సవాళ్ళ వల్ల పార్టీకి ఏమి ఉపయోగం అన్నది ఆలోచించుకోవాలి.

నాగబాబు ఏమి మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదు అని కూడా అంటారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ గా ఉన్నారా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఆయన్ 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తే లక్షలలో ఓట్లు వచ్చాయి. అతి తక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి రఘురామ క్రిష్ణం రాజు నాడు గెలిచారు అంటే ఒక విధంగా నర్సాపురం ఓటర్లు జనసేనను మెచ్చినట్లే.

మరి అలాంటి చోటకు మళ్ళీ నాగబాబు వెళ్ళారా. గత మూడున్నరేళ్ల కాలంలో ఆయన అక్కడ ఏదైనా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారా అంటే జవాబు లేదు అనే వస్తుంది. జనాలు గెలిపించిన ఎంపీ రాజుగారు పోయి ఢిల్లీలో కూర్చుంటే నేను ఉన్నాను అని నాగబాబు అక్కడ గట్టిగా నిలబడితే రేపటి ఎన్నికల్లో ఆయనకే కదా మేలు జరిగేది. అయినా సరే నాగబాబు తన టీవీ షోస్ తానూ అంటూ గడిపేశారు. ఆ మధ్యన గాడ్సే గ్రేట్ అంటూ కూడా ఏదేదో మాట్లాడారు.

ఇక తమ్ముడు పార్టీకి తాను బలమైన పిల్లర్ అవుతారు అనుకుంటే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా అనవసర తలనొప్పి గా ఉంది అన్న మాట ఉంది. లేకపోతే ఏపీ అభివృద్ధి మీద జగన్ పవన్ కళ్యాణ్ తో డిబేట్ కి రావాలట. ఇదేమన్నా బాగుందా. అలా ఎక్కడైనా జరుగుతుందా. జగన్ ఎందుకు వస్తారు. ఆయన ఏపీ సీఎం. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతోనే కలసి అసెంబ్లీలో డిబేట్ చేయడానికే ఆలోచిస్తారు.

అలాంటిది పవన్ తరఫున తాను అంటూ నాగబాబు ఈ విచిత్ర సవాల్ చేశారు. అంతే కాదు ముందస్తు ఎన్నికలు పెట్టనని జగన్ హామీ ఇవ్వాలట. అది కూడా ఏమైనా అర్ధం ఉందా అంటున్నారు. ఇక నాగబాబు వైసీపీ వారి మీద చేస్తున్న కామెంట్స్ కూడా ఎబ్బెట్టుగానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ నేతల మీద తోలుబొమ్మలాటలో కేతిగాళ్ళు అంటూ ఆయన మాట్లాడుతున్నారు.

ఆయన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిగా మాట్లాడేది సూటిగా ఉండాలి. చేస్తే నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి. దానిని అవతల వారు పట్టించుకోకపోయినా జనాలు అయినా బాగా అడిగారు అనేలా ఉండాలి. కానీ నాగబాబు మాత్రం ఇంకా సినిమాటిక్ గానే సవాళ్ళు విసురుతూ వస్తున్నారు. దీని వల్ల జనసేనకు ఏమైనా మేలు జరుగుతుందా అన్న చర్చ కూడా ఉందిట. మొత్తానికి నాగబాబు రాజకీయం చూస్తే విమర్శలు అన్నవి కామెడీగానే ఉంటున్నాయి అన్న వారే ఉన్నారు దీని వల్ల పార్టీ విశ్వసనీయత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నారు.