Begin typing your search above and press return to search.

పవన్ కి ట్రబుల్స్ స్టార్ట్...సభా సంఘం ఎదుట కూడా...?

By:  Tupaki Desk   |   22 Oct 2022 3:30 PM GMT
పవన్ కి ట్రబుల్స్ స్టార్ట్...సభా సంఘం ఎదుట కూడా...?
X
మొత్తానికి చూస్తే ఏపీలో వైసీపీకి జనసేనకు మధ్య రాజకీయ యుద్ధం మొదలైపోయింది. పవన్ ఇగోని హర్ట్ చేశారు. అది విశాఖలో బీచ్ రోడ్డు హొటల్ సాక్షిగా జరిగింది అని జనసేన వర్గాలు అంటున్నాయి. లక్షలాది అభిమానులతో తనకు తిరుగులేదని భావించే పవన్ కళ్యాణ్ణి ఏకంగా రెండు రోజుల పాటు ఏమీ కాకుండా నాలుగు గోడల హొటల్ గదికే విశాఖ పోలీసులు పరిమితం చేశారు. దాంతో పవన్ దెబ్బ తిన్న పులిగా మారారు. ఆయన మొదట తన కోపాన్ని విశాఖలో మీడియా సమావేశంలోనే వైసీపీ సర్కార్ మీద చూపించారు.

ఆయన తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు వైసీపీ సర్కార్ మీద చేశారు. అయినా సరే పవన్ ఆగ్రహం చల్లారలేదు, ఏకంగా ఒక రాత్రిలో ఇరవై నాలుగు ట్వీట్లు చేశారు అంటేనే ఆయన ఎంతలా విశాఖ ఘటనల పట్ల మండిపోయారో అర్ధమవుతుంది. ఆ తరువాత ఆయన విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ లో వైసీపీ ప్రభుత్వ పాలనను మరోమారి ఏకి పారేశారు. ఆ తరువాత మరుసటి రోజు జనసేన క్యాడర్ తో పెట్టిన మీటింగులో ఆయన విశ్వరూపమే చూపించారు.

అయితే ఇక్కడ ఆయన అనుచితమైన భాషను వాడి బాలన్స్ తప్పేశారు అన్న కామెంట్స్ వచ్చాయి. పవన్ నిజంగా అంతటి ఉగ్రరూపం చూపిస్తారని ఎవరూ ఊహించలేదు. పవన్ కోపాన్ని అంతలా ఎవరూ చూసి ఎరగరు. దాంతో పవన్ ఆవేశంతో వాడిన కొన్ని పదాలు ఇపుడు ఆయన్ని బిగ్ ట్రబుల్స్ లోకి నెట్టబోతున్నాయని అంటున్నారు. పవన్ చెప్పు చూపించి చేసిన తీవ్రమైన కామెంట్స్ మీద మొదట్లో కేవలం ప్రతి విమర్శలతో సరిపెట్టిన జగన్ సర్కార్ ఇపుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉందని అంటున్నారు.

పవన్ ఆవేశంతో చేసిన కొన్ని కామెంట్స్ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకునేవే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఒక బహిరంగ సభలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద పరుషమైన పదజాలంతో కానీ లేక సైగలతో కానీ, లేక కోపంతో కానీ తన చర్యల ద్వారా కానీ ప్రజలను రెచ్చగొడుతూ నిందించే విమర్శలు చేయడం బెదిరించడం వంటివి చట్టప్రకారం వివిధ సెక్షన్ల మీద చర్యలు తీసుకునేందుకు అర్హమైనవే అని మేధావులు కూడా చెబుతున్నారు. రాజకీయపరమైన విధానపరమైన విమర్శలు చేయడంలో తప్పు లేడు కానీ ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో చులకనగా పలుచనగా చేస్తూ విమర్శలు చేయడం మాత్రం చట్టరీత్యా శిక్షలకు అర్హమైనవే అని అంటున్నారు.

ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఆయన్ పదే పదే చెప్పులను చూపిస్తూ ప్రజా ప్రతినిధులను పట్టుకుని అనుచితమైన వ్యాఖ్యలు చేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాంతో ఆయన మీద పోలీసు చర్యల కంటే కూడా నేరుగా స్పీకర్ కి ఫిర్యాదు చేయడం ద్వారా సభా సంఘం ఎదుటకు రప్పించి చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఈ విధానం అయితే స్పీకర్ కి పూర్తి అధికారాలు ఉంటాయి. స్పీకర్ అధికారాల విషయంలో ఎవరూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు.

అందువల్ల ఈ విధానాన్ని వైసీపీ వారు ఎంచుకుని తొందరలోనే పవన్ కి సభా సంఘం తరఫున నోటీసులు ఇప్పిస్తారని అంటున్నారు. నిజానికి చూస్తే సభా సంఘం పవర్ ఫుల్. అక్కడకు ఎవరైనా హాజరు కావాల్సిందే. గతంలో అచ్చెన్నాయుడు కూడా రెండు సార్లు గైర్ హాజరు అయినా చివరికి హజరై తన వివరణ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కొడాలి నాని వంటి వారు సభా సంఘం ఎదుట హాజరయ్యారు.

ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పట్టుకుని చెప్పుతో బెదిరించి దారుణమైన భాష వాడారని పవన్ మీద అభియోగాన్ని మోపుతారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. దానికంటే ముందు ఇపుడు మహిళా కమిషన్ రంగంలోకి దిగి ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటూ సమాజానికి చెడు సందేసం ఇస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే మహిళలను పట్టుకుని స్టెప్నీలు అని పదం ఆయన వాడడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ నోటీసులో పేర్కొన్నారు.

దీని మీద పవన్ క్షమాపణలు చెబుతూ వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. గతంలో మహిళా కమిషన్ తరఫున చంద్రబాబు, బొండా ఉమకు కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మొత్తానికి పవన్ కి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేయడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మరి పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.