Begin typing your search above and press return to search.

గులాబీ కండువా ప‌డేసి..ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు

By:  Tupaki Desk   |   29 April 2017 4:39 AM GMT
గులాబీ కండువా ప‌డేసి..ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు
X
తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధికార‌ప‌క్షంగా మారిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు తెలంగాణ టీడీపీలో చేర‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తెలంగాణ‌లో చ‌చ్చిన పాముగా గులాబీ ముఖ్య‌నేత‌లు అభివ‌ర్ణిస్తున్న తెలుగుదేశం పార్టీలోకి టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప‌లువురు సైకిల్ ఎక్కేయ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్ని ఎవ‌రూ విన‌రంటూ టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌ల న‌డుమ‌.. గులాబీ కండువాల్ని తీసేసి.. ప‌చ్చ కండువాలు వేసుకునేందుకు సిద్ధం కావ‌టం విశేషంగా చెప్పాలి.

తాండూరులో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాపోరు బ‌హిరంగ స‌భ‌కు వెళుతున్న రేవంత్ రెడ్డికి.. మ‌న్నెగూడులో టీడీపీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జెండా ఎగుర‌వేసిన రేవంత్‌.. కొంద‌రు టీఆర్ ఎస్‌.. కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నాయ‌కులు టీడీపీలోకి ఆహ్వానిస్తూ వారికి కండువాలు క‌ప్పారు.

అధికార‌ప‌క్షం బ‌లంగా ఉన్న చోట‌.. పెద్ద‌గా బ‌లంగా లేని విప‌క్షంలోకి నాయ‌కులు చేర‌టం అంత తేలిగ్గా కొట్టి పారేయాల్సిన అంశం ఏమీ కాదు. అందులోకి రానున్న ఇర‌వైఏళ్ల‌లో తెలంగాణ‌లో ప‌వ‌ర్ త‌మ‌దేన‌ని తేల్చి చెబుతున్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న ధీమాను గులాబీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. పార్టీని విడిచి విప‌క్షం చెంత‌న చేర‌టం చిన్న విష‌యం కాద‌నే చెప్పాలి. ఈ వేదిక మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల మేనిఫేస్టోను అమ‌లు చేయ‌టంలో టీఆర్ఎస్ స‌ర్కారు పూర్తిగా ఫెయిల్ అయ్యింద‌న్న ఆయ‌న‌.. కేసీఆర్ స‌ర్కారు కౌంట్ డౌన్ మొద‌లైంద‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌ను వ‌దిలి విప‌క్షంలో చేరిన నేత‌ల గురించి గులాబీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/