Begin typing your search above and press return to search.

అవును.. కోదండ‌రాం గో బ్యాక్ అన్నారు

By:  Tupaki Desk   |   29 April 2017 4:30 AM GMT
అవును.. కోదండ‌రాం గో బ్యాక్ అన్నారు
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని ఊరికే అన‌లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం నిజాయితీగా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పోరాడి.. త‌న వాదంతో తెలంగాణ ప్ర‌జానీకాన్ని.. తెలంగాణ రాజ‌కీయ ప‌క్షాల్ని ఏకం చేసిన సామ‌ర్థ్యం కోదండం మాష్టారి సొంతంగా చెబుతారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కోదండం మాష్టార్ని ట‌చ్ చేయ‌టానికి అప్ప‌టి ప్ర‌భుత్వం భ‌య‌ప‌డేది. అంతేనా.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌టానికి వెన‌క‌డుగు వేసేవారు. ఆయ‌నేం చేసినా.. ఆయ‌న్ను ప‌ల్లెత్తు మాట అనే సాహ‌సం కూడా చేసే వారు కాదు. ఎలాంటి రాజ‌కీయ ప‌ద‌వి.. రాజ్యాంగ‌ప‌ర‌మైన హోదా లేకున్నా.. కోదండ‌రాంను అత్యంత శ‌క్తివంత‌మైన నేత‌గా గుర్తించే వారు. అందుకు త‌గ్గ‌ట్లే గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భించాయి.

విభ‌జ‌న త‌ర్వాత ప‌రిస్థితులు మొత్తంగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం నిజాయితీగా ప‌ని చేసిన కోదండం మాష్టారు ఎలాంటి ప‌ద‌వీ తీసుకోకుండా ఉండిపోయారు. నిజానికి ఆయ‌న కానీ ఏ రాజ‌కీయ ప‌ద‌వి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ద‌మే. అయితే.. ఉద్య‌మ నేత‌గా ఉండిపోవాల‌నుకున్నారే కానీ.. ఉద్య‌మ ఫ‌లాల్ని అధికారంగా మార్చుకోవాల‌ని ఏ మాత్రం అనుకోలేదు.

రాష్ట్రంగా ఏర్ప‌డిన నాటి నుంచి మిగిలిన రాజ‌కీయ నేత‌ల మాదిరి ఉత్తుత్తినే విమ‌ర్శ‌లు చేయ‌కుండా సంయ‌మ‌నాన్ని పాటించారు. స‌ర్కారు త‌ప్పుల్ని ఒక ద‌శ‌లో స‌మ‌ర్థించారు కూడా. కొత్త రాష్ట్రంలో ఆ మాత్రం త‌ప్పొప్పులు స‌హ‌జ‌మేన‌న్న‌ది ఆయ‌న మాట‌. రెండేళ్ల వ‌ర‌కూ విమ‌ర్శ‌లకు దూరంగా ఉన్న ఆయ‌న‌.. త‌ర్వాత నుంచి ఇష్యూల వారీగా త‌న వాద‌న‌ను వినిపించ‌టం షురూ చేశారు. ప్ర‌భుత్వ త‌ప్పుల్ని ప్ర‌శ్నించే కార్య‌క్ర‌మానికి తెర తీశారు.

కోదండం మాష్టారి మాట‌లో వ‌చ్చిన మార్పు తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారింది. కోదండం చేసే వ్యాఖ్య‌ల‌కు ఘాటు రియాక్ష‌న్‌ తో గులాబీ నేత‌లు విరుచుకుప‌డ‌టం అల‌వాటుగా మారింది. చివ‌ర‌కు ఆయ‌న దీక్ష చేస్తాన‌న్నా.. ప‌ర్మిష‌న్‌ కు నో చెప్పేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న నిర‌స‌న‌కు డేట్ ఇవ్వ‌ట‌మే కానీ.. ఆ విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే ఉండేది కాదు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో ప‌రిస్థితి ఒక్క‌సారి మారింది. ఆ మ‌ధ్య‌న కోదండం మాష్టారి ఇంటి త‌లుపుల్ని బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న వైనం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అంత పెద్ద ఉద్య‌మాలు చేసినా ఎదురుకాని ప‌రిస్థితులు.. ఆయ‌న క‌ల‌లు క‌న్న తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌గ‌టంపై ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే.. రైతుల స‌మ‌స్య‌ల్ని తెలుసుకునేందుకు తాజాగా యాదాద్రి.. భువ‌న‌గిరి.. సూర్యాపేట జిల్లాల్లోని మార్కెట్ యార్డుల్లో సంద‌ర్శిస్తున్న కోదండం మాష్టారికి ఊహించిన అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న్ను అడ్డుకునే క్ర‌మంలో టీఆర్ ఎస్ నేత‌లు కోదండ‌రాం గో బ్యాక్ అంటూ నినాదాలు చేయ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్‌.. జేఏసీ నాయ‌కుల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. భువ‌న‌గిరి జిల్లా కేంద్రంలోని గంజ్‌.. మోత్కూరు వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డు.. సూర్యాపేట మార్కెట్ యార్డుల‌ను సంద‌ర్శించేందుకు కోదండం మాష్టారు అండ్ కో వెళ్ల‌గా.. వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ ఎస్ నేత‌లు. కోదండం గో బ్యాక్‌.. జేఏసీ డౌన్ డౌన్ అని.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌టం గ‌మ‌నార్హం. త‌మ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన టీఆర్ ఎస్ నేత‌ల తీరుపై జేఏసీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట‌.. వాగ్వాదం చోటు చేసుకొని ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇదిలా ఉంటే.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌న త‌ల తెగిప‌డ్డా వెన‌క్కి త‌గ్గే ఆలోచ‌న లేద‌ని కోదండం మాష్టారు తేల్చి చెప్పారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా తాము నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంటే.. దానిని అడ్డుకోవ‌టం ఏ మాత్రం స‌రి కాదంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా ఎదురుకాని ఇలాంటి అనుభ‌వంపై జేఏసీ నేత‌లు అగ్గి మీద గుగ్గిల‌మైపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/