Begin typing your search above and press return to search.

ఆ పాత్రికేయుడి ఇంటి మీదకు టీఆర్ఎస్ కార్యర్తల దాడి

By:  Tupaki Desk   |   9 Oct 2021 6:40 AM GMT
ఆ పాత్రికేయుడి ఇంటి మీదకు టీఆర్ఎస్ కార్యర్తల దాడి
X
పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తరచూ వార్తల్లోకి వస్తుంటారు. అయితే.. సానుకూల వార్తల కంటే కూడా ప్రతికూల వార్తలతోనే ఆయన దర్శనమిస్తుంటారు. రెండు మూడు రోజుల క్రితం ఆయన ప్రయాణిస్తున్న వాహనం బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిందన్న వార్తలు వచ్చాయి. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినట్లుగా ధర్మారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.

తమ ఎమ్మెల్యేను బద్నాం చేయటానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తమ నాయకుడి ఇమేజ్ దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారంటూ సదరు మీడియా సంస్థకుచెందిన రిపోర్టర్ ఇంటి మీదకు దాడికి యత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు యాభై మందికి పైనే ధర్మారెడ్డి కార్యకర్తలుగా చెప్పే వారు.. ధర్మారెడ్డి జిందాబాద్.. జై చల్లా.. జైజై చల్లా అంటూ చెలరేగిపోయారని.. సదరు రిపోర్టర్ ఇంటి మీదకు దాడికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు.

విచిత్రమైన విషయం ఏమంటే.. సదరు విలేకరి ఇల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే ఉండటం. ఒక ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటూ యాభై మంది కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేస్తుంటే.. ఏమీ తెలీనట్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై జర్నలిస్టు యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతల మీదా.. పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.