Begin typing your search above and press return to search.

చేతులు జోడించి అర్థించినా వారిద్ద‌రూ విన‌లేదే

By:  Tupaki Desk   |   20 March 2018 11:35 AM GMT
చేతులు జోడించి అర్థించినా వారిద్ద‌రూ విన‌లేదే
X
మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌టం తేలికే. కానీ.. దాన్ని చ‌ర్చ‌కు తీసుకురావ‌ట‌మే క‌ష్ట‌మ‌న్న‌ట్లుగా మారింది. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీ అధికార‌.. విప‌క్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ముచ్చ‌ట‌గా మూడోసారి సైతం చ‌ర్చ జ‌ర‌గ‌కుండా స‌భ వాయిదా ప‌డ‌టం తెలిసిందే. ఈ రోజు స‌భలో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చకు అవ‌కాశం లేకుండా వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేస్తున్న టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే నేత‌ల తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

అన్నింటికి మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేతులు జోడించి.. త‌మ అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేందుకు స‌హ‌క‌రించాల్సిందిగా కోరిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోని తీరు చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాల‌కు సంబంధించిన అంశ‌మ‌ని.. ఐదు నిమిషాల పాటు స‌హ‌క‌రించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీఆర్ఎస్‌.. అన్నాడీఎంకే ఎంపీల‌కు విన్న‌వించినా వారు మాత్రం విన‌కుండా.. త‌మ దారిన తాము నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌మ అవిశ్వాస తీర్మానానికి స‌హ‌క‌రించాల్సిందిగా కోరిన జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌కు అన్నాడీఎంకే ఎంపీలు బ‌దులిస్తూ.. తాము కావేరీ వివాదంపై 70 ఏళ్లుగా పోరాడుతున్న‌ట్లుగా చెప్ప‌టం విశేష‌మైతే.. టీఆర్ ఎస్ నేత‌లు మాత్రం రిజ‌ర్వేష‌న్ల అంశంపై తాము పోరాడుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. వెల్ లోకి దూసుకెళ్లి నిర‌స‌న చేస్తున్న ఇరు పార్టీల నేత‌లు ఎవ‌రికి వారు త‌మ డిమాండ్లు తీవ్ర‌మైన‌వి చెప్ప‌టం మిన‌హా.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది క‌లిగించేందుకు మాత్రం స‌హ‌క‌రించ‌క‌పోవ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. గ‌డిచిన ప‌దిహేను రోజులుగా స‌భా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌కుండా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నా.. ఆర్థిక బిల్లుల్ని ఆమోదిస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. చూస్తుంటే.. మోడీ స‌ర్కారు త‌మ‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స‌హ‌చ‌ర పార్టీ నేత‌లు చేతులు జోడించి అర్ధించినా.. విన‌ని టీఆర్ ఎస్.. అన్నాడీఎంకే నేత‌లు త‌మ చేత‌ల‌తో చెబుతున్న విష‌యాలు ప్ర‌జ‌లకు అర్థ‌మవుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.