Begin typing your search above and press return to search.

కేంద్ర బ‌డ్జెట్‌ పై టీఆర్ ఎస్‌ - వైసీపీ గుస్సా!

By:  Tupaki Desk   |   5 July 2019 2:30 PM GMT
కేంద్ర బ‌డ్జెట్‌ పై టీఆర్ ఎస్‌ - వైసీపీ గుస్సా!
X
కేంద్ర‌ప్ర‌భుత్వం శుక్ర‌వారం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు షాక్ త‌గిలింది. ఈ బ‌డ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌ లో ఉన్న ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌కు భారీ ఎత్తున కేంద్రం నిధులు కేటాయిస్తుంద‌ని అధికార పార్టీలు అయిన టీఆర్ ఎస్‌ - వైసీపీ ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నాయి. అయితే బ‌డ్జెట్ చూసిన వాళ్ల‌కు దిమ్మ‌తిరిగిపోయింది. తెలంగాణ‌కు ఎలా ఉన్నా న‌వ్యాంధ్ర‌లో కీల‌క ప్రాజెక్టులు అయిన పోల‌వ‌రం - రాజ‌ధాని లాంటి ప్రాజెక్టుల ఊసే బ‌డ్జెట్‌ లో లేకుండా పోయేస‌రికి రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.

తెలంగాణ‌లో ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించ‌డం మిన‌హా ఆ రాష్ట్రానికి కేంద్ర బ‌డ్జెట్ వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ఈ బ‌డ్జెట్ వ‌ల్ల ఏ రాష్ట్రానికి - ప్రజలకు అంత ఉపయోగకరంగా లేదని టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అయితే ప్రతి ఇంటికి తాగు నీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరమని అన్నారు. అయితే తెలంగాణ‌లో మిష‌న్ భ‌గీర‌థ పేరుతో ఇప్ప‌టికే ఉన్న ప‌థ‌కాన్ని కాపీ కొట్టి కేంద్రం దీనిని ప్ర‌తిపాదించింద‌న్నారు. ఇక విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీనెర‌వేర్చ‌లేద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు.

ఇక టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత నామా నాగేశ్వ‌ర‌రావు కొత్త బ‌డ్జెట్ వ‌ల్ల ఎవ్వ‌రికి ఉప‌యోగం లేద‌ని విమ‌ర్శించారు. హర్ ఘర్ జల్ పథకాన్ని తెలంగాణలోని మిషన్ భగీరథ స్పూర్తితో పెట్టారని.. భగీరథకు ఆర్ధిక సహాయం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఇక టీ కాంగ్రెస్ నేత‌లు అయిన ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి - రేవంత్‌ రెడ్డి - ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి కూడా ఈ బ‌డ్జెట్ వ‌ల్ల తెలంగాణ‌కు ఎంత మాత్రం ఉప‌యోగం లేద‌ని విమ‌ర్శించారు. కోమ‌టిరెడ్డి అయితే ఏకంగా కేంద్ర బడ్జెట్‌ ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌ గా కోమటిరెడ్డి అభివర్ణించారు. ఐదేళ్లుగా కేసీఆర్ మోడీ భ‌జ‌న చేసినా తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు.

ఇటు ఏపీలో అధికార వైసీపీ కూడా బ‌డ్జెట్‌ పై పెద‌వి విరుస్తోంది. ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష‌నేత విజ‌య‌సాయిరెడ్డి బ‌డ్జెట్‌ పై విరుచుకుప‌డ్డారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదన్నారు. అలాగే పోల‌వ‌రం, రాజ‌ధాని ప్ర‌స్తావ‌న కూడా బ‌డ్జెట్‌ లో లేక‌పోవ‌డంతో వైసీపీ ఎంపీలు మీడియా ముందు మోడీని ఎండ‌గ‌ట్టేస్తున్నారు. ఇదే క్ర‌మంలో బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని వైసీపీ గుర్రుగా ఉంది. ఏదేమైనా కేంద్ర బ‌డ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్ర‌భుత్వాల‌కు పెద్ద షాకే ఇచ్చింది.