Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీఆర్ఎస్? కేసీఆర్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2021 5:30 PM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీఆర్ఎస్? కేసీఆర్ ప్లాన్ ఇదేనా?
X
తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు తెలీని మొండితనం.. తమ మీద తమకు అపారమైన నమ్మకం లాంటివి కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు భిన్నం. అప్పుడప్పుడు ఆయన తప్పటడుగులు వేస్తారే కానీ.. అదే పనిగా రాంగ్ ట్రాక్ లో జర్నీని ఇష్టపడరు. చిన్న తేడాను సైతం సూక్ష్మ గ్రాహక శక్తితో గుర్తించే ఆర్ట్ కేసీఆర్ సొంతం. ఈ కారణంతోనే పార్టీలో ఎన్ని లోపాలు ఉన్నా.. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా.. తెలంగాణలో తనకు మించిన ప్రత్యామ్నాం మరొకరు లేరన్న భావన కలుగజేయటంలో ఆయనకు ఆయనే సాటి.

తాజాగా అలాంటి చతురతను ప్రదర్శించనున్నారు కేసీఆర్. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఒకటైతే.. మరొకటి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి సంబంధించి గులాబీ బాస్ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాన్ని ఇవ్వలేదు. అదే సమయంలో.. ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కావటం.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి అభ్యర్థి బరిలో ఉన్న వేళలో.. పోటీకి దించి ఎదురుదెబ్బ తినే కన్నా.. అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే వరంగల్ పట్టభద్రుల ఎన్నిక విషయంలో అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరావుకు సిగ్నల్ ఇవ్వటమే కాదు.. నాయకత్వానికి సైతం సంకేతాలు ఇచ్చేసినట్లు చెబుతున్నారు.

సాధారణంగా అధికారపక్షం ఎన్నికల బరిలో నిలవకుండా ఉండదు. ఇజ్జత్ కి సవాల్ అన్నట్లుగా ఫీల్ కావటం.. ఏదోలా గెలవాలని నానా యత్నాలు చేయటం చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే.. ఉద్యమం నాటి వ్యూహాన్ని వాడాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. తాము పోటీకి దిగితే విజయవకాశాలు తక్కువగా ఉన్న వేళ ప్రత్యామ్నాయం మీద ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.

ఇందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వటం ద్వారా మంచి జరుగుతుందన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అధికారం కోసం అదే పనిగా ఆశపడే తీరు తమకు లేదన్న విషయాన్ని చెప్పేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న గులాబీ పార్టీకి.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటిదేమీ లేకుండా బయటపడొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. చేతిలో అధికారం ఉండి కూడా.. ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండటం ద్వారా.. తనను మ్యాప్ చేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వట్లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.