Begin typing your search above and press return to search.

పాల‌మూరు బంద్ మ‌ర్మం ఇదా?

By:  Tupaki Desk   |   12 July 2015 6:20 PM GMT
పాల‌మూరు బంద్ మ‌ర్మం ఇదా?
X
పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కం నీటి స‌మ‌స్య ద‌శ‌ను దాటిపోయి.... పార్టీలు పాల‌కుల స‌మ‌స్య‌గా మారిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టు అంశంతో ఇప్ప‌టికే ఉప్పు నిప్పులా ఉన్న తెలుగుదేశం-టీఆర్ఎస్ పార్టీలు మ‌రింత దూరం పెంచుకున్నాయి. పైగా ఈ నిర్ణ‌యం ఇరు రాష్ర్టాల‌కు చెందింది కావ‌డంతో తెలంగాణ‌-ఏపీ ప్ర‌భుత్వాలు సైతం త‌మ ప్రెస్టీజీ మ్యాట‌ర్‌గా ఫీల‌య్యాయి.

ఈ క్ర‌మంలోనే పాల‌మూరు బంద్‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ సాధారణంగా నిర‌స‌నలు, బంద్‌ల‌కు దూరంగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఆ ప‌ని చేశారు. దీని మ‌ర్మం ఏంట‌నే చ‌ర్చ సాగుతుంటే అందుకు ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది.

గతంలో కేసీఆర్ పాల‌మూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన నేప‌థ్యం ఉంది. అయినా గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గాలి వీచినా పాలమూరు జిల్లాల్లో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కలేదు. మ‌రోవైపు కొద్దికాలం క్రితం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ త‌ర‌ఫు అభ్య‌ర్థి ఓడిపోయారు. మొత్తంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం కాకపోవడంపై కేసీఆర్‌ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో కేసీఆర్‌ ఆ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని జిల్లాలో బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పాలమూరు ఎత్తిపోతల పథకం వివాదాన్ని రాజేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ స‌ర్కారు ఇచ్చిన లేఖ అనుకోకుండా క‌లిసి వ‌చ్చింది. దీంతో టీడీపీ జిల్లా ప్రజలకు వ్యతిరేకమనే సంకేతాలిచ్చేలా బంద్‌ పిలుపిచ్చి సక్సెస్‌ అయ్యారు గులాబీ నేతలు.

మొత్తంగా త‌ను ప్రాతినిథ్యం వ‌హించిన జిల్లాపై ప‌ట్టుకోసం కేసీఆర్ యాక్టివ్‌గానే ప‌నిచేస్తున్నారు.