Begin typing your search above and press return to search.

ఏపీకి కేసీఆర్‌.. ఇందుకేనా వ‌చ్చేది?

By:  Tupaki Desk   |   16 Sep 2022 8:28 AM GMT
ఏపీకి కేసీఆర్‌.. ఇందుకేనా వ‌చ్చేది?
X
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. దీంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నార‌ని.. అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించారు. దీంతో వైఎస్ జ‌గ‌న్ కూడా తెలంగాణ వెళ్లి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

మ‌ళ్లీ మూడేళ్ల త‌ర్వాత కేసీఆర్ విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. అయితే కేసీఆర్ వ‌చ్చేది సీపీఐ (క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) జాతీయ మ‌హాస‌భ‌ల‌కు అని చెబుతున్నారు. సీపీఐ జాతీయ మ‌హాస‌భ‌లు అక్టోబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్నాయి. వీటికి దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ ముఖ్య నేత‌లు వ‌స్తార‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌, తెలంగాణ సీపీఐ మాజీ కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూడా ఆహ్వానించామ‌న్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్, బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు. అలాగే 23 దేశాల నుంచి క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు, సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి త‌దిత‌రులు హాజ‌రవుతార‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌కు రానున్న కేసీఆర్.. కేవ‌లం సీపీఐ జాతీయ మ‌హాస‌భ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతారా లేదంటే వైఎస్సార్సీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను కూడా క‌లుస్తారా అనేదానిపై ఆస‌క్తి నెల‌కొంది. గ‌త కొన్నేళ్లుగా కేసీఆర్‌.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ర‌హిత పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే.

థ‌ర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఈ విష‌యం మీద వైఎస్ జ‌గ‌న్‌ను ఇంత‌వ‌ర‌కు క‌ల‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌సి థ‌ర్డ్ ఫ్రంట్‌లో చేరాల‌ని కోర‌తారా, లేదా అనేది ఆస‌క్తి గొలుపుతోంది. సీఎం జ‌గ‌న్‌ను కేసీఆర్ క‌లిసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేద‌ని అంటున్నారు.

కాగా గ‌తంలో క‌మ్యూనిస్టు పార్టీల‌పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వాటిని తోక పార్టీల‌ని ఈస‌డించారు. అయితే తెలంగాణ‌లో ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మ‌రోవైపు బీజేపీ త‌న‌ను త‌రుముకుని వ‌స్తుండ‌టంతో క‌మ్యూనిస్టుల‌తో చెలిమి చేయ‌ని ప‌రిస్థితికి కేసీఆర్ జారిపోయార‌ని అంటున్నారు. అందులోనూ ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న మునుగోడులో క‌మ్యూనిస్టుల‌కు మంచి బ‌లం ఉంది. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎక్కువ‌సార్లు క‌మ్యూనిస్టులే విజ‌యం సాధించారు.

అలాగే తెలంగాణ‌లో న‌ల్గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, ఆదిలాబాద్ త‌దిత‌ర జిల్లాల్లోనూ క‌మ్యూనిస్టు పార్టీల‌కు మంచి బ‌లం ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరితో క‌లిసి సాగాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా. వారికి ఉండే ఓట్ల శాతం త‌న పార్టీకి ఉప‌క‌రించ‌గ‌ల‌ద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీపీఐ జాతీయ మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రవుతున్నార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.